– ముచ్చటగా మూడు గ్రూపులు
– వేములవాడలో పోటాపోటీగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
– అయోమయంలో కార్యకర్తలు
– ఇదేంటంటూ ప్రజల్లో హాట్ చర్చ
ప్రజానావ/వేములవాడ: వేములవాడ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారుతుంది. అధికార పార్టీకి చెందిన సొంత నేతలే వర్గాలుగా విడిపోయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడంతో వేములవాడ నియోజకవర్గంంలో రాజకీయ చర్చ జోరందుకుంది. కేటీఆర్ జన్మదిన సందర్భంగా సోమవారం సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పలు కార్యక్రమాలు నిర్వహించారు. రాజన్న ఆలయంలో కోడె మొక్కు చెల్లించారు. హరితహారం మొక్కలు నాటారు.
చెన్నమనేని అనుచరులు కూడా గ్రామాల్లో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. వేములవాడ టికెట్ కోసం బరిలో ఉన్న మరో నేత చల్మెడ లక్ష్మీ నరసింహారావు వర్గం సైతం కేటీఆర్ వేడుకలను పోటా పోటీగా నిర్వహించారు. ఆయన వర్గీయులు నిమ్మశెట్టి విజయ్, తీగల రవీందర్ గౌడ్ ల ఆధ్వర్యంలో కోడె మొక్కు చెల్లించి రాజన్న ఆలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి తనదైన పంథాలో రామన్న బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు 300 మంది ఉపాధిహామీ కూలీలకు హాట్ బాక్సులను పంపిణీ చేశారు.
జెండా ఒక్కటే.. ఎజెండా ఎవరికి వారిదే..
వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు ముదురుతోంది. జెండా ఒక్కటే అయినా.. ఎజెండా మాత్రం ఎవరికీ వారిదే అన్నట్టుగా సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఐదో సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులు ఉన్నాయంటూ చల్మెడ విద్యా సంస్థల అధినేత లక్ష్మీ నరసింహారావు తన పని తాను చేసుకుంటూ మరో వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు.
యువ నాయకుడిగా కేటీఆర్ కు సన్నిహితుడిగా ఏనుగు మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో పట్టు పెంచుకుంటున్నాడు. నియోజకవర్గంలో ఎవరు చనిపోయినా.. పరామర్శకు ” ఏనుగు” ముందుంటారన్న పేరు ప్రజల్లో నానుతుంది. వర్గపోరుతో కార్యకర్తల మధ్య విభేదాలు పెరిగి రాజకీయ పోరుకు దారితీస్తోంది. ఇదంతా జిల్లా మంత్రి అయిన కేటీఆర్ కు సైతం తలనొప్పిగా మారుతుంది. దీంతో బీఆర్ఎస్ లో వేములవాడ టికెట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది.