ప్రజానావ, సిరిసిల్ల: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఉద్యోగ ప్రకటనలు చూసి మోసపోవద్దని సిఐ అనిల్ కుమార్ సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూర్ గ్రామంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సోమవారం సిరిసిల్ల టౌన్ సిఐ అనిల్ కుమార్ గ్రామ ప్రజలతో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. వివిధ రకాల సామాజిక సమస్యలు చట్టాలపై, డయల్ 100, షీ టీమ్, సైబర్ నేరాలు మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ, ఎవరైనా బాధితులు సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రతి ఒక్కరు రోడ్ భద్రత, ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని, త్రిబుల్ రైడింగ్,రాంగ్ సైడ్ వెహికల్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని నడపడం, రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలను నడపడం,సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపడం లాంటివి చేయకూడదని హెచ్చరించారు.
యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కారాదని, ఎవరైనా గుట్కాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే పోలీసువారికి తెలపాలన్నారు. ఎవరైనా మొబైల్స్ ను పోగొట్టుకున్నప్పుడు CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తుల పట్ల అనుమానం ఉన్నా వెంటనే పోలీసులు డయల్ 100 కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీకాంత్, గ్రామ ప్రజలు సిబ్బంది, పాల్గొన్నారు.