చెన్నైదే ఐపీఎల్ టైటిల్
ఉత్కంఠభరిత మ్యాచ్ లో గుజరాత్‌పై చెన్నై సంచలన విజయం
ఐదోసారి టైటిల్‌ను ముద్దాడిన ధోనీ సేన
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-16 సీజన్ విజేతగా నిలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ధోనీ సేన ఐదోసారి టైటిల్‌ను ముద్దాడింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించి చెన్నై లక్ష్యాన్ని 171 పరుగులుగా ఖరారు చేశారు. ఈ లక్ష్యాన్ని చెన్నై చివరి బంతికి ఛేదించింది. డేవాన్ కాన్వే (47), రహానె (27), రుతురాజ్ గైక్వాడ్ (26), రాయుడు (19) రాణించారు. చివరి ఓవర్ (మోహిత్ శర్మ)లో 13 పరుగులు అవసరం కాగా, మొదటి నాలుగు బంతుల్లో మూడే పరుగులు రావడంతో చివరి రెండు బంతుల్లో 10 పరుగులుగా మారింది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ దశలో క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా (15) వరుసగా సిక్స్, ఫోర్‌తో చెలరే జట్టును ఒంటిచెత్తో గెలిపించాడు. అంతకుముందు గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్లు సాహా (54), శుభ్‌మన్ గిల్ (39) మంచి శుభారంభం ఇవ్వగా, ఫస్ట్ డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ చెలరేగి ఆడాడు. కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు చేసి త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ డేవాన్ కాన్వేకు దక్కింది. ఇక గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. గిల్ 17 ఇన్నింగ్స్‌ల్లో 890 పరుగులు చేశాడు. ఇదే జట్టుకు చెందిన మహ్మద్ షమీ17 మ్యాచుల్లో 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఫేర్ ప్లే అవార్డును ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోగా, క్యాచ్ ఆఫ్ ది సీజన్‌ను రషీద్ ఖాన్ చేజిక్కించుకున్నాడు.