– ముంపు ప్రాంతాల్లోని కాలనీల్లోకి వరద
– వరంగల్-ఖమ్మం రాకపోకలు బంద్
– జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అంగన్‌వాడీలోకి వరద నీరు
ప్రజానావ/వరంగల్: ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మంగళవారం వాన దంచికొట్టింది. భారీ వర్షాలతో ముంపు ప్రాంతాల్లోని కాలనీల్లకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల వరద ఉధృతికి రహదారులు దెబ్బతిన్నాయి. ఇక పంథిని సమీపంలో ప్రధాన రహదారిపై వరద ప్రవాహం కొనసాగడంతో వరంగల్-ఖమ్మం రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గుట్టల నుంచి వచ్చే వరద ఉధృతి పెరగడంతో పెద్దంపల్లి ఎస్సీ కాలనీతో పాటు పంగిడిపల్లి, ఆసిరెడ్డిపల్లి గ్రామాల్లో వరద నీరు ఇండ్లల్లోకి చేరింది. ఆసిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రంలోకి వరద నీరు రావడంతో అంగన్‌వాడీ కేంద్రంలోని సామగ్రి అంతా తడిసిపోయింది. మహబూబాబాద్‌లోని మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఏరును అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.