కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు ఒక్కటే

0
28

– కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. బీఆర్​ఎస్​లో చేరారు

– బీజేపీతోనే తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం సాధ్యం

– మోడీ నాయకత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం

– అవినీతి పార్టీలు ఏకమైతే దేశం కుక్కలు చింపిన విస్తరు అయితది

– మహాజన్​ సంపర్క్​ యాత్ర.. ఇంటింటికీ బీజేపీలో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

ప్రజానావ, హైదరాబాద్ : కాంగ్రెస్​కు బీఆర్​ఎస్​కు తేడా లేదని, రెండు ఒకటేనని కేంద్ర మంత్రి జి. కిషన్​ రెడ్డి అన్నారు. గతంలో ప్రజలు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 12 మంది బీఆర్​ఎస్​ పార్టీలో చేరారని, ఎమ్మెల్సీలు మొత్తం కట్టకట్టుకొని బీఆర్​ఎస్​లోకి పోయారని ఆయన గుర్తు చేశారు. బీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుందని స్పష్టం చేశారు. గురువారం మహాజన్​ సంపర్క్​ అభియాన్​.. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఆయన అంబర్​పేట్​ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

మంత్రి మాటల్లో..

– ఎన్నో త్యాగాలు, ఆత్మబలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ.. ఈ రోజు ఓ కుటుంబం పాలైంది.  ఆ కుటుంబం వేల కోట్ల ప్రజల డబ్బును దోచుకొని మళ్లీ ఏలాలనుకుంటున్నది.. భూములు, బిల్డింగ్​లు కొనాలనుకుంటున్నరు. ఈ రోజు తెలంగాణ అవినీతిమయం అయింది. కల్వకుంట్ల కుటుంబంపాలైంది.  మాటల గారడితో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నరు.  రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రావాలంటే.. రాష్ట్రం కోసం అమరులైన 1200 వీరుల ఆకాంక్షలు నెరవేరాలంటే.. బీఆర్​ఎస్​ కుటుంబ పార్టీని ప్రజలు ఓడించాలి. అవినీతి, నియంతృత్వ, అక్రమాలు చేసే పార్టీని, అధికారం దుర్వినియోగం చేసే పార్టీని ఓడించాలి.

కాంగ్రెస్​కు ఓటేస్తమంటే.. కాంగ్రెస్​కు, బీఆర్​ఎస్​కు తేడా లేదు. గతంలో మనం చూశాం.. ప్రజలు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 12 మంది బీఆర్​ఎస్​ పార్టీలో చేరారు.. ఎమ్మెల్సీలు మొత్తం కట్టకట్టుకొని బీఆర్​ఎస్​లోకి పోయారు. అందుకే బీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుంది.  బీఆర్​ఎస్​తో బీజేపీ ఇప్పటి వరకు పెట్టుకోలేదు.. భవిష్యత్​లో పెట్టుకోదు. కానీ కాంగ్రెస్​ పార్టీ అనేక ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నది.. ఢిల్లీలో టీఆర్​ఎస్​ వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో కూడా టీఆర్​ఎస్​ వాళ్లు కాంగ్రెస్​ హయాంలో మంత్రులుగా చేశారు.

రాష్ట్రంలో నిజమైన ప్రజాప్రభుత్వం రావాలంటే, నిజమైన బీఆర్​ఎస్​ వ్యతిరేక ప్రభుత్వం రావాలంటే.. అది బీజేపీతోనే సాధ్యం.  వందల, వేల కోట్ల రూపాయాలు అక్రమంగా సంపాదించి.. ఆ డబ్బును ఓటర్లకు పంచి ఎన్నికల్లో గెలవాలనే దుర్మార్గపు ఆలోచనతో ఇక్కడి అధికార పార్టీ, కేసీఆర్​ ఉన్నారు.  డబ్బులతో ప్రజలను ఎక్కువసార్లు మభ్యపెట్టలేరు. గతంలో జరిగిన హుజూరాబాద్​, హైదరాబాద్​ కార్పొరేషన్​ ఎన్నికలు అందుకు సాక్ష్యం.

– భారత ప్రధాన మంత్రి మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 9 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించేందుకు, దేశవ్యాప్తంగా బీజేపీ బూత్​ కమిటీలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తున్నాయి. ఈరోజు గోల్నాక డివిజన్​లో పర్యటించి కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్నా 5 కేజీల ఉచిత బియ్యం వస్తున్నాయా? లేదా? అందరికీ బ్యాంక్​ అకౌంట్​ ఉందా లేదా? ఆయుష్మాన్​ భారత్​ అమలవుతున్నదా? లేదా? తెలుసుకున్నాం.

– స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు నా హయాంలో కట్టించినవే.. బస్తీలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు అంబర్​పేట్​ నియోజకవర్గంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి.  నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయం లేదు. చిన్న చిన్న పార్టీలు ప్రజల ధానాన్ని దోపిడీ చేసే అవినీతి, కుటుంబ పాలన పార్టీలు అన్ని ఏకమైతే దేశానికి ప్రమాదం.. ఈ విషయం ప్రజలకు తెలుసు. వాళ్లు ఏకమైతే దేశం కుక్కలు చింపిన విస్తరి అయితది.  మోడీ నాయకత్వంలో దేశంలో సుస్థిరమైన, ప్రజలకు అభివృద్ధి చేసే, దేశ గౌరవం పెంచే ప్రభుత్వం ఉన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here