నేటి నుంచి శ్రీవారి అర్జిత సేవ, దర్శన టికెట్లు

0
80

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదలకు టీటీడీ నిర్ణయించింది. సెప్టెంబర్‌ నెల కోటాను సోమవారం విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు అని పేర్కొంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు డబ్బు చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీవారి భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో వీటిని బుక్ చేసుకోవచ్చు అని సూచించింది. జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం రిలీజ్ చేయనుంది. సెప్టెంబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాతో పాటు వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. 23న ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29 వరకు జరుగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జూన్ 22న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూన్ 24 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇదిలాఉంటే ఆదివారం 87వేలకు పైగా భక్తలు శ్రీవారిని దర్శించుకోగా, 43,753 మంది తలనీలాలు సమర్పించారు. రూ 3.61 కోట్ల మేర హుండీ ఆదాయం సమకూరింది. టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here