– ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ పేరుతో ప్రజల్లోకి
– బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం సాధించిన విజయాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సోమవారం ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ నినాదాన్ని అమలు చేస్తోందంటూ పేర్కొన్నారు. టాయిలెట్ల నిర్మాణం, రేషన్, ఇండ్ల నిర్మాణం వంటి మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. గతంలో రూపాయి పంపిస్తే లబ్ధిదారులకు 15 పైసలే అందేవని, అవినీతి జరుగుతోందన్న విషయాన్ని అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా అంగీకరించారంటూ ఈ సందర్భంగా బండి సంజయ్ పేర్కొన్నారు. అందుకే డీబీటీ విధానంతో అవినీతికి తావులేకుండా మోదీ ప్రభుత్వం ప్రతీ లబ్ధిదారుడికి అందజేస్తుందన్నారు. ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ పేరుతో దేశ ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ప్రజల్లోకి వెళుతున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తరువాత అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. గత పాలనలోని మంచి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత ఒక్క మోదీదేనని చెప్పారు. గతంలో ఇందిరాగాంధీ హయాంలో ‘గరీబీ హఠావో’ నినాదం మంచిదే.. అయితే ఆ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారో తెలుసుకుని, మంచి ఉద్దేశంతో టాయిలెట్ల నిర్మాణం, రేషన్ బియ్యం అందజేత సహా పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.