– రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకే ఆలౌట్
– అర్ధ సెంచరీ సాధించిన పుజారా
– ఆసీస్ టార్గెట్ 75
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌటైన రోహిత్ సేన, రెండో ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోరు (163) కుప్పకూలింది. టెస్టు స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా అర్ధ సెంచరీ సాధించడంతో భారత్ ఆ మాత్రం స్కోర్ అయినా సాధించగలిగింది. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం ఒక ఎండ్‌లో నిలబడి టీమిండియా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 45.1 ఓవర్లో 108 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 50 పరుగులు సాధించాడు.
పుజారా టెస్టు కెరీర్‌లో ఇది 35వ హాఫ్ సెంచరీ. 163 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు ప్రత్యర్థి జట్టుకు 75పరుగుల టార్గెట్‌గా నిర్దేశించింది. ఇదిలాఉంటే తొలి గంట నుంచే బంతి గింగిరాలు తిరిగిన ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం పిచ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టెస్టు కూడా మూడు రోజుల్లోనే ముగుస్తుందనే అంచనాలు కలుగుతున్నాయి. నాథన్ లయాన్ 8 వికెట్లు పడగొట్టగా, మిచెల్ స్టార్క్, కుహ్నెమన్ ఒక్కో వికెట్ తీశారు.