– రేపు విచారణకు రావాలన్న దర్యాప్తు సంస్థ
– దర్యాప్తునకు సహకరిస్తా.. కొంచెం టైం కావాలి
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. ఇందులో గురువారం విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అరుణ్ రామచంద్ర పిళ్లైతో పాటు కవితను విచారించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అరుణ్ రామచంద్రన్ పిళ్లైని నిన్న అరెస్ట్ దర్యాప్తు సంస్థ.. తాను కవిత బినామీనని రామచంద్ర పిళ్లై చెప్పారని తెలిపింది. రామచంద్ర పిళ్లైని దాదాపు 80 సార్లు ప్రశ్నించింది. ఇక ఇదే కేసులో గతంలో అరెస్టయిన గోరంట్ల బుచ్చిబాబు కొంతకాలం కవిత ఆడిటర్‌గా పనిచేశారు. ఇదిలాఉంటే మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తానన్న కవితకు ఒకరోజు ముందే ఈడీ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
15న హాజరవుతా..
ఈ క్రమంలో ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రేపు ఈడీ హాజరు కాలేనని, 15న హాజరవుతానని లేఖ లో పేర్కొన్నారు. 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని. ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయ్యాయని ఈడీకి వివరించారు. అయితే కవిత లేఖపై ఈడీ పర్మిషన్ ఇస్తుందా? లేదా? అనే విషయంపై ఉత్కంఠత నెలకొంది. ఇదిలాఉంటే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లోని ఎమ్మెల్సీ కవిత ఇంటికి వెళ్లే దారులన్నీ అధికారులు మూసి, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.