తిరుమలలో మళ్లీ చిరుతలు సంచరించడంతో శ్రీవారి భక్తులు భయాందోళన చెందుతున్నారు. సోమవారం అలిపిరి నడకదారిలో మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరించాయని, కేకలు వేయడంతో అడవిలో పారిపోయినట్లు భక్తులు పేర్కొంటున్నారు.
ఇదే విషయమై సమాచారం అందుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ సిబ్బంది రంగంలోకి దిగి చిరుతల జాడలను గుర్తిచే పనిలో పడ్డారు. మరోవైపు చిరుతల సంచారంతో భక్తులంతా ఒక్కొక్కరిగా కాకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు.
అధికారులు సైతం భక్తులను గుంపులుగానే పంపిస్తున్నారు. ఈ నెల 15న కూడా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో చిరుత సంచరించినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి.
గతంలో ఇదే అలిపిరి మార్గంలో నెల్లూరు జిల్లాకు చెందిన చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విజిలెన్స్ అధికారులు చాలావరకు చిరుతలను బంధించారు. అయినా చిరుతలు సంచరించడంతో భక్తలు భయాందోన చెందుతున్నారు.