HCA: ఇక వ‌రంగ‌ల్‌లోనూ రంజీ మ్యాచ్‌లు

0
324
  • ఓరుగ‌ల్లులో కొత్త‌ స్టేడియం నిర్మాణంపై అపెక్స్‌లో చ‌ర్చిస్తాం
  • ప్ర‌తి జిల్లాలో స్టేడియం కట్టేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నాం
  • ర్యాష్ట వ్యాప్తంగా 29 కేంద్రాల్లో స‌మ్మ‌ర్ క్యాంప్‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించాం
  • త్వ‌ర‌లో రాష్ట్రస్థాయి టీ20 టోర్నీ
  • హెచ్‌సీఏ అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు

అధునాతున హంగుల‌తో వ‌రంగ‌ల్‌లో ఒక కొత్త స్టేడియం నిర్మిస్తామ‌ని, దీనిపై త్వ‌ర‌లో అపెక్స్ కౌన్సిల్‌లో చ‌ర్చిస్తామ‌ని హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు వెల్ల‌డించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 29 కేంద్రాల్లో హైద‌రాబాద్ హెచ్‌సీఏ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హించిన వేస‌వి శిక్ష‌ణ శిబిరాలు సోమ‌వారంతో ముగిశాయి. వరంగల్‌లోని లాల్ బహుదూర్ క్రీడా మైదానంలో నిర్వ‌హించిన స్థానిక‌ స‌మ్మ‌ర్ క్యాంప్ ముగింపు వేడుక‌ల్లో జ‌గ‌న్‌మోహ‌న్ రావు, ఉపాధ్య‌క్షుడు ద‌ల్జిత్ సింగ్‌, స‌హాయ కార్య‌ద‌ర్శి బ‌స‌వ‌రాజు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌మోహ‌న్ రావు మాట్లాడుతూ ఇక నుంచి వ‌రంగ‌ల్‌లోనూ రంజీ మ్యాచ్‌లు నిర్వ‌హించేందుకు ప్రయత్నిస్తామ‌ని అన్నారు. ప్ర‌తి జిల్లాలోనూ ఒక మంచి స్టేడియం నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే ఆ కార్య‌చ‌ర‌ణ అమ‌లు చేస్తామ‌ని చెప్పారు.

అలానే కొద్ది రోజుల్లో హైద‌రాబాద్‌లో రాష్ట్ర స్థాయి టి20 క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌తి జిల్లా నుంచి ఒక జ‌ట్టుకు ఇందులో ఆడేందుకు అవ‌కాశ‌మిస్తామ‌ని, ఈ టోర్నీ ఫైనల్‌ను ఉప్పల్ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తామ‌ని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి ప్ర‌తిభావంతుల‌ను గుర్తిస్తాం


స్టార్ క్రికెట‌ర్లంద‌రూ గ్రామీణ ప్రాంతాల నుంచి వ‌చ్చిన‌వారేన‌ని, తెలంగాణ గ్రామాల్లోనూ అద్భుత‌మైన ప్ర‌తిభావంతులు ఉన్నార‌ని, వారిని గుర్తించి, సాన‌పెడ‌తామ‌ని జ‌గ‌న్‌మోహ‌న్ రావు చెప్పారు.

ఇందుకోస‌మే స‌మ్మ‌ర్ క్యాంప్‌ల‌ను ఇంత భారీ స్థాయిలో నిర్వ‌హించామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,500 మంది వ‌ర్ధ‌మాన క్రికెట‌ర్లు ఈ స‌మ్మ‌ర్ క్యాంప్‌ల్లో ఉచితంగా శిక్ష‌ణ తీసుకున్నార‌ని చెప్పారు.

ఇందుకోసం సుమారు రూ.1.50 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని జ‌గ‌న్‌మోహ‌న్ రావు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో వరంగల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ గౌడ్‌, కార్య‌ద‌ర్శి చాగంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జమీర్ అహ్మద్ నజీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here