Eatala Rajendar: కేసీఆర్ క్షేమం కాదనే ప్రజలు ఇంటికి పంపించిన్రు

0
169
  • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు
  • చీమలపుట్టలో పాములు చేరినట్టు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది
  • రాష్ట్రంలో మళ్లీ మామూళ్ల రాజ్యం మొదలైంది
  • డబ్బులు ఇస్తే తప్ప పనులు జరిగే పరిస్థితి లేదు
  • బీజేపీ సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌

పదేళ్ల పాలన తర్వాత కేసీఆర్‌ తీరును అర్థం చేసుకున్న ప్రజలు ఆయనను ముఖ్యమంత్రి కొనసాగించడం క్షేమం కాదని ఇంటికి పంపించారని ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం ఆయన నల్లగొండ-ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేందర్‌ రెడ్డి తరఫున నల్లగొండలో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ గురించి ప్రజల్లో చర్చనే లేదన్నారు. ఇక కాంగ్రెస్‌ చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లుగా అధికారంలోకి వచ్చిందన్నారు.

అనేక స్కాములు, అవినీతి కార్యక్రమాలకు నెలవు ఈ పార్టీ 40 ఏళ్లపాటు సగటు భారతీయుడు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చిందని విమర్శించారు. గతిలేక ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు.

వారి డాబు.. దర్పం, వసూళ్లు మళ్లీ మొదలయ్యాయన్నారు. ఇప్పడే ప్రజలు ఈ దౌర్జన్యం ఎలా భరించాలో అని భయపడుతున్నారని ఈటల పేర్కొన్నారు.

ప్రేమేందర్ రెడ్డి 40 ఏళ్లుగా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారని, పార్టీ.. ప్రజలు తప్ప వేరే ఆలోచన లేని వ్యక్తి అని కొనియాడారు.

సంకీర్ణ రాజకీయాలకు స్వస్థి పలికిన మోడీ


నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత సంకీర్ణ రాజకీయాలకు స్వస్తి పలికారని, నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ దేశానికి గొప్ప విశ్వాసాన్ని కలిగించారన్నారు.

ప్రపంచంలో దేశ ఔన్నత్యాన్ని పెంచారని, అమెరికా సైతం వారి సెనెట్లో మోడీ.. మోడీ అంటూ నినాదాలు చేసే స్థాయికి ఎదిగామన్నారు. రష్యా ఉక్రెన్ యుద్ధంలో మధ్యవర్తిగా వ్యవహరించాలని రష్యా లేఖ రాయడం మన స్థాయిని తెలియజేస్తుందని గుర్తుచేశారు.

కరోనా కాలంలో ధైర్యం అందించడమే కాకుండా అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ తయారుచేసి ప్రపంచ దేశాలకు అందించిన ఘనత మోడిదన్నారు. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, మూడో స్థానానికి తీసుకురావడమే లక్ష్యంగా మోడీ పనిచేస్తున్నారని చెప్పారు.

370 ఆర్టికల్ రద్దుచేసి జమ్మూ కాశ్మీర్ ను భారత్ లో భాగమే కన్నెత్తి చూడొద్దు అని హెచ్చరిక జారీచేసిన నాయకుడు నరేంద్ర మోడీ అని, లాల్ చౌక్ లో స్వేచ్ఛగా ఈరోజు త్రివర్ణ పతకాన్ని ఎగరవేస్తున్నామంటే దానికి మోడీయే కారణమన్నారు.

రాజకీయాల్లోనూ బీజేపీ సామాజిక సమతుల్యాన్ని పాటించిందని ఈటల పేర్కొన్నారు. 27 మంది ఓబీసీ, 12 మంది దళిత, ఎనిమిది మంది గిరిజన, ఐదుగురు మైనారిటీ మంత్రులు ఉన్న ఏకైక క్యాబినెట్ నరేంద్ర మోడీదేనన్నారు.

ఒక మహిళను ఆర్థిక మంత్రి చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో వెంకటయ్య, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు రామచంద్రరావు, జనార్దన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ఆరు నెలలైనా హామీల ఊసేలేదు..


రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుతీరి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల ఊసేలేదని ఈటల విమర్శించారు.

ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఓట్లు వేయరేమో అన్న భయంతో దేవుళ్ల మీద ప్రమాణం చేసి రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని ప్రగల్భాలు పలికారు తప్ప దాన్ని అమలు చేయాల్సిన విశ్వాసం కనిపిస్తలేదన్నారు.

మహిళలకు రూ.2500, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు, రూ.4000 పింఛన్ ఏది అమలు కాకపోగా.. చివరికి మళ్లీ కరెంటు కోతల మొదలయ్యాయన్నారు.

రాష్ట్రంలో మళ్లీ మామూళ్ల రాజ్యం మొదలైందని, డబ్బులు ఇస్తే తప్ప పనులు జరిగే పరిస్థితి లేదని వాపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here