Telangana: 17 జిల్లాలకు కుదిస్తారా?

0
408
  • పునర్విభజనకు సీఎం రేవంత్‌ రెడీ
  • ఎన్నికల కోడ్‌ ముగియగానే ప్రక్రియ ప్రారంభం
  • జ్యుడిషియల్‌ కమిషన్‌ ఏర్పాటు యోచనలో ప్రభుత్వం

జిల్లాల పునర్విభజనకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను 17 పార్లమెంట్‌ స్థానాల్లో ఒక్కో జిల్లా చొప్పున చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

గతంలోనే జిల్లాల విస్తరణ అశాస్త్రీయంగా ఉందని విమర్శించిన ముఖ్యమంత్రి ఆ దిశగా ముందుకెళ్తున్నారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియను సమీక్షించేందుకు జ్యుడిషియల్‌ కమిషన్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే యోచనలో ఉంది.

అయితే ఈ ప్రక్రియను ఎన్నికల కోడ్‌ ముగియగానే ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను ఆ తర్వాత 33 జిల్లాలుగా చేయడంతో తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

కొన్నిచోట్ల పాత జిల్లాలు ఐదు జిల్లాలుగా విడిపోవడంతో ప్రజలతో పాటు నాయకులు సైతం ఇబ్బందులు పడ్డారు. పరిపాలనలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ పలువురు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లినా అవేవీ ఆయన పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆ తర్వాత అందరూ ఆ విషయాన్ని మరిచిపోయారు.

ఇదంతా గమనించిన కాంగ్రెస్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే సమస్యను పరిష్కరిస్తామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. అంతేకాకుండా నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటు హామీని మేనిఫెస్టో సైతం ఉంచింది.

అప్పటి బహిరంగ సభల్లో కాంగ్రెస్‌ కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలకు మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు పేరుతో పాటు జనగామ జిల్లాను సర్వార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జిల్లాగా మారుస్తామని హామీ కూడా ఇచ్చింది.

ఇందులో భాగంగానే జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ చేసేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలోనూ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇదే విషయాన్ని గుర్తుచేశారు.

పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ జిల్లాలను కుదిస్తుందని, అది చాలా మీకే ప్రమాదకరమని జనాలను ఉద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here