- వరుసగా నాలుగో ఓటమి
- ఐదు వికెట్లతో గెలిచిన పంజాబ్
గౌహతి: రాజస్థాన్ రాయల్స్‌కు పంజాబ్ కింగ్స్ గట్టి షాక్ ఇచ్చింది. గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై పంజాబ్ అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
స్లో పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (48; 34 బంతుల్లో, 6×4), రవిచంద్రన్ అశ్విన్ (28; 19 బంతుల్లో, 3×4, 1×6) టాప్ స్కోరర్లు.
సామ్ కరన్ (2/24), రాహుల్ చాహర్ (2/26), హర్షల్ పటేల్ (2/28) తలో రెండు వికెట్లతో చెలరేగారు. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
సామ్ కరన్ (63; 41 బంతుల్లో, 5×3, 3×6) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ (2/28), చాహల్ (2/31) చెరో రెండు వికెట్లు తీశారు. రాజస్థాన్ రాయల్స్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి.
ఛేదనకు దిగిన పంజాబ్‌కు పేలవారంభం లభించింది. ఎనిమిది ఓవర్లలో 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (6; 4 బంతుల్లో, 1×4), రొసో (22; 13 బంతుల్లో, 5×4), శశాంక్ సింగ్ (డకౌట్, 2 బంతుల్లో), బెయిర్‌స్టో (14; 22 బంతుల్లో, 1×4) పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు.
పవర్‌ప్లేలో పంజాబ్ 39 పరుగులు చేసింది. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జితేశ్ శర్మ (22; 20 బంతుల్లో, 2×6)తో కలిసి సామ్ కరన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
వీరిద్దరు అయిదో వికెట్‌కు 46 బంతుల్లో 63 పరుగులు జోడించారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ తర్వాత దూకుడు పెంచింది.
అశ్విన్ వేసిన 15వ ఓవర్‌లో సామ్, జితేశ్ చెరో సిక్సర్ బాది 14 పరుగులు పిండుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని తర్వాతి ఓవర్‌లో చాహల్ విడదీశాడు.
భారీ షాట్‌కు యత్నించిన జితేశ్ బౌండరీ లైన్‌లో రియాన్ పరాగ్ చేతికి చిక్కాడు. దీంతో పంజాబ్ విజయం సమీకరణం చివరి 24 బంతుల్లో 33 పరుగులుగా మారింది.
ఆ తర్వాత సామ్ కరన్ టాప్ గేర్‌లోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అశుతోష్ శర్మ (17; 11 బంతుల్లో, 1×4, 1×6) కూడా బ్యాటు ఝుళిపించడంతో పంజాబ్ 7 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.