bandi: అప్పులు తీర్చడం కోసమే వ్యవసాయం

0
42
  • ఎకరాకు రూ.25వేల పరిహారం అందించాల్సిందే
  • పంట బీమాను అమలు చేయాలి
  • రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయట్లేదు?
  • కౌలు రైతులకు ఎకరాకు రూ.12 వేలు ఇవ్వాలి
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్
  • సిరిసిల్లలో నష్టపోయిన పంట పొలాల పరిశీలన

‘నాకు తెలిసి ఏ రైతు కూడా లాభం కోసం వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. చేసిన అప్పులు తీర్చడం కోసమే వ్యవసాయం చేసే దుస్థితి ఏర్పడింది.

రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడ్డట్లు చరిత్రలో లేదు. ఈ విషయం అన్ని పార్టీలకు తెలుసు.

అధికారంలోకి రాకముందు ఒక మాట.. వచ్చిన తర్వాత మరో మాట రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం ఆయన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సిరిసిల్ల నియోజకవర్గం పోతుగల్ గ్రామంలో పంట నష్టపోయిన పొలాలను పరిశీలించి, బాధిత రైతులతో మాట్లాడారు.

పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. వారి బాధలను విన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.25 వేల చొప్పున తక్షణ సాయం అందించాలన్నారు. అకాల వానలతో రైతులు నష్టపోతూనే ఉన్నరు.

గతంలో కురిసిన వర్షాలతో నా నియోజకవర్గంలో చాలాచోట్ల రైతులు పంట నష్టపోయారని పేర్కొన్నారు. ఈసారి సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి, పొతుగల్, గంభీరావుపేట ప్రాంతాల రైతులు చాలా నష్టపోయారన్నారు.

అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంటల బీమా పథకం, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 లక్షల సాయం అందించాలని కోరారు.

కేసీఆర్‌ పైసా సాయం చేయలే..


‘గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించి ఎకరాకు రూ.10 వేల సాయం వెంటనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించిండు.

కానీ పైసా సాయం చేయలే. కేంద్రం ఫసల్ బీమా పథకం ప్రవేశపెడితే అది అమలు చేయకుండా అంతకంటే గొప్ప పథకం అమలు చేస్తానని పదేళ్లుగా మాటలు చెప్పిండే తప్ప ఇంతవరకు అమలు చేయలేదు.

ఏ ఒక్క రైతుకు కూడా నయాపైసా సాయం చేసిన దాఖలాల్లేవు. కోపంతో రైతులు పంటలను తగలబెట్టుకున్నరు.

ఇదే జిల్లాలో వడ్ల కుప్పలపై చనిపోయారు. అప్పు తెచ్చి పంట పెట్టుబడి పెడుతున్నరు. సాగు చేసి తీరా పంట చేతికొచ్చే సమయానికి పంట నష్టపోతున్నరు. చివరకు తెచ్చిన అప్పును తీర్చేందుకే మళ్లీ సాగు చేస్తున్నారు.

ఇంకా బాధాకరమేందంటే.. సాగు చేసుకుందామంటే సమయానికి నీళ్లియ్యరు. నీళ్లుంటే కరెంటు ఉండదు.. కరెంట్ ఉంటే పంట చేతికొచ్చే సమాయానికి అకాల వర్షాలతో పంట మునిగిపోతది.

పోనీ చేతికి పంట వచ్చినా తేమ పేరుతో వడ్ల కొనుగోళ్లలో రైతులను అన్యాయం చేస్తరు. మద్దతు ధర ఇయ్యరు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎందుకు ఆదుకోవడం లేదు?


‘కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు? మీరు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు?

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు తక్షణ సాయం అందించాలి. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేల చొప్పున సాయమందించాలి.

కౌలు రైతులకు సైతం సాయం అందించాల్సిందే. రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి. పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలి.

ఎన్నికల పేరుతో ఆపే ప్రయత్నం చేయొద్దు. ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని సాయం అందించాల్సిందే.

నాకు తెలిసి ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్పదు. ఈ విషయంలో తమ పార్టీ రైతుల కోసం పూర్తిగా సహకరిస్తాం’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here