target: టార్గెట్‌ బీఆర్‌ఎస్‌, బీజేపీ

0
7

ఆసక్తికరంగా కంటోన్మెంట్ రాజకీయం
కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్‌
అదే బాటలో నివేదిత..?
ఫలితాలిస్తున్న కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌

బీజేపీ కార్యక్రమంలో మంగళవారం ఈటల రాజేందర్‌తో శ్రీభరత్‌

ఇటీవల ఓ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ‘చేరికలకు ఒక్క గేటు తెరిచాం.. పీసీసీ అధ్యక్షుడిగా ఇక పూర్తిగా రాజకీయమే చేస్తా’నంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

రేవంత్‌ రెడ్డి ఆ మాట అన్నాడో లేదో గంటల వ్యవధిలోనే బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎంపీ రంజింత్‌ రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హస్తం గూటికి చేరారు.

అంతకుముందే మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి సహా చాలాచోట్ల కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత పలువురు మాజీలు, ద్వితీయ శ్రేణి నాయకులంతా కాంగ్రెస్‌లో వైపు తిరిగారు.

తాజాగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ రాజకీయం ఇటు బీఆర్‌ఎస్‌.. అటు బీజేపీకి తలనొప్పిగా మారింది. ఇదిలాఉంటే ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానం ఖాళీ కావడంతో అందరి కన్ను ఆ స్థానంపైనే పడింది.

ఇటీవల కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ ఈ స్థానానికి ఉప ఎన్నిక ప్రకటించడంతో ఎవరి ప్రయత్నలు వారు చేస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం వరకు బీజేపీతోనే ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీగణేశ్‌ పార్టీకి ఒక్కసారిగా షాక్‌ ఇచ్చారు.

ఎమ్మెల్సీ మహేశ్‌ గౌడ్‌, మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఈ విషయం ఆలస్యం తెలియడంతో నాయకులంతా ఖంగుతిన్నారు. 13ఏళ్ల రాజకీయంలో శ్రీగణేశ్‌ పార్టీ మారడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన శ్రీగణేశ్‌ 2018లో టికెట్‌ ఆశించి భంగపడ్డారు. దీంతో వెంటనే హస్తానికి బైబై చెప్పి బీజేపీ పార్టీలో చేరారు.

అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండకుండా బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. సాయన్న మరణానంతరం జరిగిన ఎన్నికల్లో పార్టీ ఆధిష్టానం లాస్య నందిత వైపు మొగ్గు చూపడంతో వెంటనే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి తిరిగి బీజేపీలో చేరారు.

అప్పటికే బీజేపీలో టికెట్‌ ఆశిస్తున్న వారిని కాదని పార్టీ శ్రీగణేశ్‌కు టికెట్‌ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్‌ నిన్నటివరకు బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

ఓవైపు సేవా కార్యక్రమాలు చూస్తూనే.. మరోవైపు మల్కాజ్‌గిరి ఎంపీగా టికెట్‌ దక్కించుకున్న ఈటల రాజేందర్‌తో పార్టీ కార్యక్రమాల్లో తిరిగారు.

అయితే ఉన్నట్టుండి కాంగ్రెల్‌ చేరడం వెనుక ఆంత్యర్యం ఏంటో అర్థం కావడం లేదంటూ నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.

కాంగ్రెస్‌ నుంచి చాలా పేర్లు
అయితే గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రజానౌక గద్దర్‌ కుమార్తె వెన్నెల పోటీచేసి మూడోస్థానంలో నిలిచారు.

అయితే ఇక్కడి నుంచే ఆమె మళ్లీ ప్రయత్నాలు చేస్తుండగా, ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అద్దంకి దయాకర్‌ కూడా పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి.

మరోవైపు బీఆర్‌ఎస్‌ నుంచి దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత సోదరి నివేదిత టికెట్‌ ఆశించారు. ఇటీవల పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా కలిశారు.

అయితే అధిష్టానం మాత్రం టికెట్‌పై ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈక్రమంలో నివేదిత కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

బీజేపీ నుంచి శ్రీ గణేశ్ కాంగ్రెస్‌లో చేరిన కొద్ది గంటలకే బీఆర్‌ఎస్‌ నుంచి నివేదిత కూడా హస్తం వైపు మొగ్గుచూపుతున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి వెన్నెల, అద్దంకి దయాకర్‌, శ్రీగణేశ్‌తో పాటు పలువురి పేర్లు వినిపిస్తుండగా.. ఇకవేళ నివేదిత కాంగ్రెస్‌లో చేరితే టికెట్‌ ఇస్తారా.. లేదా అనేది మిస్టరీగా మారింది.

మరోవైపు బీఆర్‌ఎస్‌లో అధినేత టికెట్‌పై ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడంతోనే నివేదత కుటుంబంతో పాటు క్యాడర్‌ అసహనం వ్యక్తం చేయ్డంతోనే పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక బీఆర్‌ఎస్‌నూ ఈ ఉప ఎన్నికకు టికెట్‌ ఆశించే వారి సంఖ్య పెద్దగానే ఉంది. గత ఎన్నికల్లోనే టికెట్‌ ఆశించిన వారిలో మన్నె క్రిశాంక్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, గజ్జెల నగేశ్‌తో పాటు ఇటీవల బీఎస్పీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేరు కూడా వినిపిస్తోంది.

ఇక బీజేపీ పార్టీ శ్రీగణేశ్‌ పార్టీ మారడంతో షాక్‌లో ఉంది. ఇక్కడి నుంచి ఎవరిని బరిలోకి దింపనుందో తెలియాల్సి ఉంది.

ఏదేమైనా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక సీటు కోసం పోరు ఇప్పటి నుంచే రసవత్తరంగా జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here