ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటివద్ద జరిగిన కాల్పుల సంఘటనలో నిందితులు వాడినట్టు అనుమానిస్తున్న రెండు తుపాకీలు,13 తూటాలు, 3మ్యాగజైన్ లను గుజరాత్ లోని తాపీ నది నుంచి క్రైమ్ బ్రాంచి పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదా సోమవారం ప్రారంభమైంది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పేరు పొందిన ఇన్‌స్పెక్టర్ దయా నాయక్‌తోపాము మొత్తం 12 మంది పోలీస్ అధికారులతో బృందం ఏర్పడి ఈ సోదా ప్రారంభించారు. స్థానిక గజ ఈతగాళ్లు, మత్సకారుల సహాయంతో నదిలోగాలింపు సాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు వికీగుప్తా(24). సాగర్ పాల్ (21) వీరిద్దరూ ముంబై లోని బంద్రా ఏరియా గెలాక్సీ అపార్ట్‌మెంట్ లోని సల్మాన్‌ఖాన్ ఇంటివద్ద ఏప్రిల్ 14న కాల్పులు జరిపిన తరువాత మోటార్ బైక్‌పై పరారీ అయ్యారు.
రోడ్డు మార్గం ద్వారా ముంబై నుంచి సూరత్‌కు చేరాక అక్కడి నుంచి రైలులో గుజరాత్ లోని భుజ్ నగరం వెళ్తూ రైలు బ్రిడ్జి నుంచి తాపీ నదిలో తుపాకీ పారవేసినట్టు నిందితులు విచారణలో వెల్లడించారు. సిసిటీవీ ఫుటేజి ప్రకారం భుజ్ లోని ఒక ఆలయంలో ఏప్రిల్ 16న పోలీస్‌లు వీరిని అరెస్ట్ చేయగలిగారు. కేవలం సంచలనం సృష్టించేందుకు కాల్పులు జరిపినట్టు పోలీస్‌లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతడి సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ల హస్తం ఉన్నట్టు పోలీస్‌లు ప్రకటించారు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ లోని సబర్మతీ సెంట్రల్ జైలులో ఉండగా, అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికా లేదా కెనడాలోఉన్నట్టు భావిస్తున్నారు. వీరిద్దరి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే కాల్పులు జరిపినట్టు నిందితులు వెల్లడించారు.