Lok Sabha elections: బీఆర్‌ఎస్‌కు మూడో స్థానమే..

0
130

ఎల్లారెడ్డిపేట, ప్రజానావ: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికే పరిమితమవుతుందని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

తను ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాంసం పంచలేదని బీరాలు పలికిన కేటీఆర్‌ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మూడో స్థానం తప్పదని గ్రహించి విచ్చలవిడిగా డబ్బులు పంచారని ఆరోపించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ చెప్పిన మాటమీద నిలబడకుండా సిరిసిల్ల శాసనసభ్యుడిగా, గతంలో మంత్రిగా చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడగాల్సింది పోయి డబ్బులు పంచే గెలిచారని ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

తన పరిపాలనలో కేటీఆర్‌ ప్రజల నాడిని పసిగట్టలేకపోయారన్నారు. దీనిపై కేటీఆర్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రజల్లో పలుచన అయిపోయిందని, పరపతి కాపాడుకునేందుకే డబ్బులతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
చందుర్తి: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.

బుధవారం రుద్రంగి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి కూర్చొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, కథలాపూర్, మేడిపల్లి భీమారం, వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్ మండల పరిధిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

అనంతరం పౌర సరఫరాల కమిషనర్ చౌహన్, జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాష, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, డీసీఏస్ఓ జితేందర్ రెడ్డి, డీ ఎం జితేందర్ ప్రసాద్, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు.

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడడమే కాకుండా వర్షాలను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు.

లారీల కొరత లేకుండా చూడాలని కోరుతూ లారీ ఓనర్ అసోసియేషన్, వేములవాడ పట్టణ పరిధిలోని వ్యాన్ అసోసియేషన్ సభ్యులకు తెలిపారు.

అనంతరం జిల్లా పారా బాయిల్డ్ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజుతో మాట్లాడి ధాన్యం బస్తాలను త్వరగా దిగుమతి చేసుకోవాలని సూచించారు.

రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తనను సంప్రదించాలని పేర్కొన్నారు. అంతకుముందు మేడిపల్లి మండలం మాచాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవానికి ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here