– ఘన స్వాగతం పలికిన శంషాబాద్ అధికారులు
ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం బుధవారం A-320 (ఎయిర్‌బస్ బెలూగా) థాయిలాండ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ కార్గో వస్తువులతో వచ్చిన విమానానికి అధికారులు ఘన స్వాగతం పలికారు. దీనిని చూసేందుకు ప్రయాణికులు ఆసక్తి కనబరిచారు. ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. మరోవైపు ఎయిర్‌పోర్ట్ నిర్వాహకులు సైతం ఈ ఎయిర్‌బస్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఒకేసారి 47టన్నుల బరువు మోయగల సామర్థ్యం దీని సొంతం. 184 అడుగుల పొడవు, 56 అడగుల ఎత్తు, ఒక్కో రెక్క వైశాల్యం 2800 చ.అడుగులు ఉండగా, ఈ ఎయిర్ బస్ బరువు 86 టన్నులకు పైనే ఉంటుంది. ఈ విమానం ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సిందే. గతంలోనూ (2022, డిసెంబర్) ఈ భారీ కార్గో విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది.