Thunderstorm:పిడుగుల బీభత్సం

0
306
  • ఒకేరోజు 15మంది మృతి
  • పశ్చిమబెంగాల్‌లో12మంది.. తెలంగాణలో ముగ్గురు బలి
  • పలువురికి గాయాలు

కోల్‌కతా: దేశవ్యాప్తంగా పిడుగులు బీభత్సం సృష్టించాయి. గురువారం ఒక్కరోజు పిడుగుపాట్లకు (Thunderstorm) 15మంది బలికాగా, ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే వేర్వేరు చోట్ల 12 మంది మృతి చెందారు.

తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, రెండు రాష్ట్రాల్లో పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగాల్‌లోని మాల్దా జిల్లా పిడుగుపాట్లతో ఉక్కిరిబిక్కిరయ్యింది. ఈ ప్రమాదాల్లో దాదాపు 12మంది చనిపోయారు.

మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉండగా.. పలువురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. (west bengal) బెంగాల్‌లోని మాల్దా జిల్లా హరిశ్చంద్రాపూర్‌లోని తూర్పు కుస్తారియా గ్రామంలో జనపనార తోటలో పనిచేస్తుండగా పిడుగుపడి దంపతులు నయన్‌రాయ్‌ (23), ప్రియాంక సింగ్‌ (20) అక్కడికక్కడే మృతి చెందారు.

అంగ్రేజ్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వ్యవసాయ పొలం వద్ద పనిచేస్తున్న పంకజ్‌ మండల్‌ (23) పిడుగుపాటుకు బలయ్యాడు.

ఓల్డ్‌ మల్డాలోని సహపూర్‌లో చందన్‌ సాహ్ని (40), మనోజిత్‌ మండల్‌ (21), రాజ్‌ మృధ (16) తోటలో మామిడికాయలు రాలగా, వాటిని తీస్తున్న క్రమంలో పిడుగుపడి మృతి చెందారు.

ఇక గజోల్‌లోని ఆదినాలో ఇంటర్‌ విద్యార్థి, మానిక్‌చక్‌ బ్లాక్‌లో షేక్‌ సబ్రుల్‌ (11), రాణా షేక్‌ (11), అతుల్‌ మండల్‌ (65) తిరిగిరాని లోకాలకు వెళ్లారు. వీరితో పాటు పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ వధువు ఉంది.

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం..


పశ్చిమ బెంగాల్‌లోని (west bengal) మాల్దా జిల్లాలో గురువారం పిడుగుపాటుతో 12 మంది మృతి చెందడంపై జిల్లా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా స్పందించారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా పిడుగుపాటుకు మృతి చెందిన వారికి విపత్తు నిధి నుంచి ఒక్కొక్కరికి

రూ.2 లక్షలు ఇస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు.. రంగారెడ్డిలో ఒక్కరు


తంగళ్లపల్లి/వేములవాడ/రంగారెడ్డి, ప్రజానావ:
పిడుగుపాటుకు రాష్ట్రానికి చెందిన ముగ్గురు బలయ్యారు.

మృతుల్లో ఇద్దరు రాజన్న సిరిసిల్ల జిల్లా (rajanna siricilla) కు చెందిన వారుండగా, మరొకరు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్‌కు చెందిన రైతు రుద్రారపు చంద్రయ్య (50) వ్యవసాయ పనుల నిమిత్తం పొలం పనులకు వెళ్లాడు.

వర్షం పడుతుండడంతో చెట్టు కింద నిలబడగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదేజిల్లా వేములవాడ రూరల్‌ (vemulawada rural) మండలం శాత్రాజుపల్లికి చెందిన కంబల్ల శ్రీనివాస్‌ మరో నలుగురు కొమురవ్వ, ఎల్లవ్వ, దేవయ్య, శ్రీనివాస్‌లతో కలిసి పొలం పనులకు వెళ్లాడు.

వర్షం రావడంతో చెట్టుకు కిందకు వెళ్లగా, వీరికి సమీపంలోనే పిడుగుపడడంతో కంబల్ల శ్రీనివాస్‌ (32) అక్కడికక్కడే చనిపోయాడు.

ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వీరిని చికిత్స కోసం వేములవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు.

పిడుపాటు గురై మృతి చెందిన కంబల్ల శ్రీనివాస్‌ భౌతిక కాయానికి ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డితో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు.

అలాగే వేములవాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితునలు పరామర్శించి ధైర్యం చెప్పారు.

అలాగే కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం పర్లపల్లికి చెందిన ఏనుగుల మల్లయ్య అనే రైతుకు చెందిన ఆవు, దూడు పిడుగు పాటుకు మృతి చెందగా, రూ.1.25లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నాడు.


రంగారెడ్డి (ranga reddy) జిల్లా కడ్తాల్‌ మండలం వాసుదేవ్‌పూర్‌లో పడిన పిడుగుపాటుకు మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన పసునూరి ప్రవీణ్‌ చారి(30) అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రవీణ్‌చారి తన మామ నాగోజు జంగయ్యతో కలిసి ఇంటికి బైక్‌పై వెళ్తూ మార్గమధ్యంలో వసుదేవపూర్‌ బస్టాండ్‌ వద్ద వర్షానికి నిలబడ్డాడు.

అక్కడ పిడుగుపడి గట్టిగా శబ్దం రాగా, ప్రవీణ్‌ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి గౌను నిరంజన్‌కు గాయాలు కాగా, చికిత్స కోసం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here