- నయా పైసా సాయం అందలే…
- బండి సంజయ్ వద్ద కన్నీరు మున్నీరైన ముస్తాబాద్ రైతులు
సార్.. నాకున్నది 2 ఎకరాలే. మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నం. ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.30 వేలు కౌలు పైసలు కట్టిన. ఇవిగాక ఎకరాకు రూ.20 వేల చొప్పున 5 ఎకరాలకు పంట పెట్టుబడి పెట్టిన. ఇంకా నాలుగు రోజులైతే పంట చేతికొచ్చేది. ఈ అకాల వానలు మా కొంప ముంచినయ్. మొత్తం పంట పోయింది. మా బతుకు కష్టమైంది.
– వెంకటేశం, ముస్తాబాద్
6 లక్షల అప్పు చేసి మా పొలానికి పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న. ఇయాళ పంట మొత్తం నీళ్లపాలాయే. నేనేం చేయాలి సారు.. నా పిల్లలను, కుటుంబం గడిచేదెట్ల సారు. చేసిన అప్పు తీరేదెట్లా? గుండె పగిలే చచ్చే కాలమొచ్చింది.
– గన్నే వెంకటేశం, పద్మ, ముస్తాబాద్ మండలం గన్నేవారిపల్లె రైతులు
సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండలంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన గ్రామాల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పర్యటించారు.
ఈ పర్యటనలో బండి సంజయ్ తోపాటు పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణి రుద్రమదేవి, జె.సంగప్పతోపాటు జిల్లా నేతలున్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ వారితో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతుల వద్దకు పోయి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు తమ బాధలను చెప్పుకుంటూ సంజయ్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘తెల్లారి లేస్తే పని చేసుకుని బతికేటోళ్లం. అప్పు తెచ్చి సాగు చేస్తే నీళ్లపాలాయే. బతికేదెట్లా?
ఇప్పటి వరకు మాకు ప్రభుత్వం నుండి నయాపైసా సాయం అందలే. రైతు బంధు రాలే. బీమా సాయం అందలేదు.
రైతు భరోసా సాయమందలే.. ఇగ బతికేదెట్లా? పిల్లలను సాదుకునేదెట్లా? ఇగ మాకు చావే దిక్కు… మీరే ఆదుకోండి సారూ…’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
మొన్నటిదాకా కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెసోళ్లు
అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యే మీ వద్దకు రాలేదా? అని బండి సంజయ్ అడిగితే.. ‘‘ఇంతవరకు ఎవరూ రాలేదు.. నువ్వే వచ్చినవ్ సారు… మమ్ముల్ని పట్టించుకునే నాథుడే లేరు..
మీరైనా న్యాయం చేయండి సారు…’’అంటూ వేడుకున్నారు. అనంతరం బండి మాట్లాడుతూ ‘మీరెవరూ అధైర్యపడొద్దు. మీ బాధ తెలుసుకునేందుకే వచ్చిన.
మొన్నటిదాకా కేసీఆర్ మోసం చేసిండు.. ఇప్పుడు కాంగ్రెసోళ్లు మోసం చేస్తున్నరు.. మీకు ప్రభుత్వ సాయం అందే వరకు ఒత్తిడి తెస్తా.
మీ తరఫున కొట్లాడతా. ధైర్యంగా ఉండండి’అంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు. అనంతరం ముస్తాబాద్ లో అకాల వర్షాలకు కరెంట్ షాక్ కు గురై చనిపోయిన ఎల్లయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
ధైర్యంగా ఉండాలని, సర్కార్ సాయం అందేలా కృషి చేస్తానని హమీ ఇచ్చారు. అక్కడి నుంచి ముస్తాబాద్ లో కూలిన చెట్లను, ధ్వంసమైన కరెంట్ తీగలను, దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు. అనంతరం గంభీరావుపేటకు బయల్దేరి వెళ్లారు.