మారుతున్న నేరాలకు అనుగుణంగా గస్తీ, పెట్రోలింగ్‌ను పెంచాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం ఆయన చందుర్తి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పోలీసు స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణతో పాటు రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు కూడా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నడుస్తున్నాయని అడిగి తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24గంటలు గస్తీ నిర్వహించాలన్నారు.
సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం దగ్గర ఉంచుకోవాలని, గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా తక్షణమే పైఅధికారులకు తెలియజేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరూ కృషి చేయాలని సూచించారు. అందరూ విధులు సక్రమంగా నిర్వహించడంతోనే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయన్నారు. ఎస్పీ వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.