Arogya Sri: ఆరోగ్య శ్రీపై నయా దందా!

0
135
  • బిల్లులు రావడం లేదంటూ నెల క్రితమే పథకాన్ని ఆపిన ఓ ప్రయివేట్‌ ఆస్పత్రి
  • తెలివిగా సరికొత్త దందాకు శ్రీకారం
  • ఓపి మాత్రమే చూస్తరట.. కానీ సర్జరీ చేయరట!
  • అవసరం లేకున్నా ఓపీ నిండా టెస్టులే
  • బయట టెస్టుల రిపోర్టులు ఇక్కడ అస్సలే పనిచేయవు
  • రిపోర్టులు రావడానికి రెండ్రోజుల సమయం
  • రిపోర్టులు చూసేందుకు మరో వైద్యుడు
  • మరిన్ని టెస్టులు చేయించుకుంటేనే మందులు రాస్తామని దబాయింపు
  • వైద్యం కోసం వెళ్లినా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న యాజమాన్యం
  • ఎల్‌బీ నగర్‌లో కార్పొరేట్‌ ఆస్పత్రిగా చలామణి అవుతున్న ఓ ప్రయివేటు ఆస్పత్రి తీరిది

కరీంనగర్‌కు చెందిన ఓ జర్నలిస్టు వృత్తిరీత్యా హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. ఇటీవల తన భార్యకు గర్భసంచిలో చిన్న సమస్య ఏర్పడడంతో సొంత జిల్లాలోనే ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చూపించాడు.

అన్నీ టెస్టులు (స్కానింగ్‌ సహా) నిర్వహించిన వైద్యులు మందులు వాడితే సరిపోతుంది. నోప్పి ఎక్కువుంటే గర్భసంచి తొలగించుకోవాలంటూ సూచించారు.

దీంతో సదరు జర్నలిస్టు జేహెచ్‌ఎస్‌ (జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీమ్‌) ద్వారా హైదరాబాద్‌లోనే ఓ మంచి ప్రయివేట్‌ ఆస్పత్రిలో చూపించి సర్జరీ చేయించాలనుకున్నాడు.

ఆ మరునాడే (ఈనెల 14) ఎల్‌బీ నగర్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తన భార్యను వెంటబెట్టుకొని వెళ్లాడు. అక్కడ ఆరోగ్యశ్రీకి బ్లాక్‌లోకి వెళ్లి ఓపీ తీసుకొని గైనకాలజిస్టుకు చూపించాడు.

సమస్యను వివరించడంతో పాటు అంతకుముందు కరీంనగర్‌ ఆస్పత్రిలో చూపించిన రిపోర్టులన్నీ వైద్యురాలికి చూపించారు.

ఏ ఆస్పత్రికి చెందిన రిపోర్టులు ఇక్కడ చెల్లవంటూ సదరు వైద్యురాలు కొత్తగా మరో ఐదు టెస్టులు (ఈ టెస్టులన్నీ కరీంనగర్‌ ఆస్పత్రిలో చేసినవే) చేయించుకొని రిపోర్టులు తీసుకురావాలని చెప్పింది.

ఇక్కడి నుంచే అసలు కథ మొదలు..


(aarogya sri) ఆరోగ్యశ్రీ, జేహెచ్‌ఎస్‌, ఈహెచ్‌ఎస్‌ పథకాలకు టెస్టులేవీ ఉచితంగా ఉండవు. ఈ విషయం ముందే తెలిసిన సదరు జర్నలిస్టు ఐదు టెస్టులకు దాదాపు రూ.5వేలు కట్టి టెస్టులన్నీ చేయించాడు.

రిపోర్టులు సాయంత్రానికి తీసుకెళ్లమని చెబితే ఒక్క టెస్టు (క్యాన్సర్‌) మినహా మిగతా రిపోర్టులన్నీ అదేరోజు ఇచ్చారు.

ఇచ్చిన టెస్టు రిపోర్టులు పట్టుకొని సదరు వైద్యురాలి వద్దకు వెళితే ఆమె కేవలం సోమ, గురువారం ఆమాత్రమే అందుబాటులో ఉంటారని, మిగతా ఒక్క టెస్టు చేయించుకొని సోమవారం రావాలని సూచించారు.

అప్పటికే నొప్పితో విలవిల్లాడుతున్న సదరు జర్నలిస్టు భార్య రెండు రోజులే కదా ఆగుదామనుకున్నారు. సోమవారం (18వ తేదీ) ఉదయమే మిగతా రిపోర్టు తీసుకొని వైద్యురాలి వద్దకు వెళ్తే..

అక్కడ మరో వైద్యురాలు ఉంది. రిపోర్టులన్నీ చూసి మరో రెండు టెస్టులు (ఒక్కటి ఎంఆర్‌ఐ, మరొకటి ఇంతకుముందే ఇదే ఆస్పత్రి వైద్యురాలు రాసిన మరో టెస్టు) రాసింది.

ఈ టెస్టులన్నీ చేయించుకొని రిపోర్టులు తీసుకొని రావాలంటూ చెప్పింది. ఈ రెండు టెస్టులు సుమారు రూ.10వేలకు పైనే ఖర్చు.

దీంతో ఓపిక నశించిన సదరు జర్నలిస్టు భార్య ముందు నొప్పి కోసం ఏమైనా మందులివ్వాలని, టెస్టు రిపోర్టులు వచ్చేవరకు సమయం పడుతుంది అని అనండంతో వైద్యురాలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ ఆస్పత్రిలో ఇలాగే ఉంటుంది.

టెస్టులన్నీ అయిపోయినా తర్వాతే మందులు రాస్తాం.. మీకు ఇష్టమైతే చూపించుకోండి.. లేదంటే మరో ఆస్పత్రికి వెళ్లండి’ అంటూ అసహనం వ్యక్తం చేసింది.

దీంతో చేసేదేమీలేక టెస్టులు చేయించుకోకుండానే వారు ఆస్పత్రి నుంచి వెనుదిరిగారు. అంటే ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ కింద ఈ ప్రయివేట్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలంటే కనీసం 10రోజులకు పైగా వీరి చుట్టూ తిరగాల్సిందే.

నయా దందా వెలుగులోకి వచ్చిందిలా..


వెళ్తూ.. వెళ్తూ సదరు జర్నలిస్టు ఆరోగ్య శ్రీ హెల్ప్‌ డెస్క్‌ వద్ద కొన్ని వివరాలు అడగ్గా అసలు దందా వెలుగులోకి వచ్చింది.

ప్రభుత్వం డబ్బులివ్వట్లేదని, ఈ ఆస్పత్రిలో నెల క్రితమే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేశారని అక్కడున్న సిబ్బంది తెలపడంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ప్రభుత్వ పథకం నిలిపివేసినా ఓపీలను ఎందుకు చూస్తున్నారనే అనుమానంతో సదరు జర్నలిస్టు తెలుసుకోగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఆరోగ్య శ్రీ, ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్‌ పథకాలపై ఆస్పత్రిలో చూపించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో వస్తుంటారు.

వారికి ఓపీ మాత్రం ఉచితంగా ఇచ్చి దాని నిండా టెస్టులు రాసి అడ్డగోలుగా వ్యాపారం చేస్తోంది. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే ఇలా అయితేనే వ్యాపారం నడుస్తదంటూ బదులిస్తున్నారు.

ఇక ఆస్పత్రికి వచ్చిన కొందరు చిన్నరోగమొచ్చినా అవసరం లేకున్నా ఆస్పత్రిలో ఉండే అన్ని టెస్టులూ చేయించుకోవాలంటూ చెబుతున్నారని, ఆ టెస్టులు చేయించుకుంటేనే మందులు రాస్తున్నారంటూ వాపోతున్నారు.

రూ.3వేల నుంచి రూ.5వేలు విలువ చేసే మందులు రాస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆరోగ్యశ్రీ బ్లాక్‌ మొత్తం వైద్య విద్యార్థులే..


మొన్నటివరకు ప్రభుత్వం నుంచి రూ.కోట్లలో వసూలు చేసిన ఈ ఆస్పత్రి ఆరోగ్య శ్రీ బ్లాక్‌లో మాత్రం కొత్తవారు, వైద్యా విద్యార్థలతోనే రోగులకు సేవలందిస్తోంది.

ఇదేంటని ప్రశ్నిస్తే.. ఉచిత సేవనే కాదా..? డబ్బులతో చూపించుకోవాలంటే ఆస్పత్రి మెయిన్‌ వార్డుకు వెళ్లాలని ఉచిత సలహా ఇస్తున్నారు.

ఇదే విషయమై అక్కడే ఉన్న ఆరోగ్యశ్రీ సిబ్బందిని అడిగితే తమకేం తెలియదని, ఓపీ ఇవ్వడం వరకే తమ పని అంటూ చేతులు దులుపుకుంటున్నారని వైద్యం కోసం సుదూరు ప్రాంతాల నుంచి వచ్చిన వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

పేరుకే నెట్‌వర్క్‌ ఆస్పత్రులు..


అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఎంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు.

కొన్ని నెట్‌వర్క్‌ (ప్రయివేట్‌) ఆస్పత్రుల్లోనూ ఈ పథకం వర్తింపజేసి, రోగి చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించేలా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.

అయితే గత కొన్నేళ్లుగా ఈ పథకంలో ఉన్న నెట్‌వర్క్‌ ఆస్పత్రులన్నీ కేవలం డబ్బును దండుకునేందుకు మాత్రమే ఈ పథకాన్ని వాడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనూ ఈ పథకాన్ని ప్రయివేట్‌ ఆస్పత్రులు కొద్దిరోజులు నిలిపివేయగా, వెంటనే తిరిగి సేవలు ప్రారంభించేలా ఆదేశించారు.

ఇటీవల అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్య శ్రీని రూ.10లక్షలకు పెంచిన విషయం తెలిసిందే.

అయితే గత నెల రోజుల నుంచి ఈ పథకాన్ని ఆస్పత్రులు నిలిపివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించి అన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ తిరిగి కొనసాగించేలా చూడాలని, కేవలం డబ్బుకోసమే ఆరోగ్యశ్రీని ఒక దందాలా మార్చుకున్న ఆస్పత్రులను గుర్తించి వాటిని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల లిస్ట్‌ నుంచి తొలగించాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here