మేనిఫెస్టో ప్రకారమే కులగణనపై తీర్మానం!
- అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాం
- గత ప్రభుత్వం సకల జనుల సర్వే రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదు?
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
‘మేం మాట ఇచ్చాము.. ఆ మాట ప్రకారమే నిర్ణయం తీసుకున్నాం’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కులగణనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు ఆయన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు.
శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలు సామాజిక, రాజకీయ, ఉద్యోగాల్లో ఎదగాలన్నదే మా ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్‌పై మండిపడ్డారు. ‘బిల్లును ప్రవేశపెట్టే సమయంలో సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
తీర్మానంపై కూడా అనుమానం వ్యక్తం చేయడం బాధాకరం. ఆ మంత్రికి నిజం చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో బిల్లుపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన సకల జనుల సర్వే రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదన్నారు. ఎప్పుడైనా మీ పార్టీ మీటింగ్‌లో ఈ విషయాన్ని అడిగారా’ అంటూ మండిపడ్డారు.
సలహాలు, సూచనలివ్వమంటే విమర్శలు చేస్తున్నారన్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కులగణన చేశాయని, అక్కడి వెళ్లి తెలుసుకోవాలని సూచించారు.
వంద శాతం ప్రయోజనం జరిగే విధంగానే జనగణన సర్వే ఉంటుందని స్పష్టం చేశారు.
విద్యార్థి దశ నుంచే ఉద్యమించాం
మురళీధర్ రావు కమిషన్ లో విద్యార్థి దశగా ఉన్నప్పటి నుంచే దీనిపై ఉద్యమించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందే వరకు మాదే బాధ్యత అన్నారు.
1931 తర్వాత 2011లో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో కులగణన జరిగిందని, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే జరుగుతుంని పేర్కొన్నారు.
చరిత్రలో ఫిబ్రవరి 16 నిలిచిపోతుందని, కులగణకు కాంగ్రెస్ నాయకత్వం అన్నివిధాలుగా సహకరించిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీనిని అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ వంటి పథకాలను అమలుచేశామని, మిగతా హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తామని చెప్పారు.
ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వచ్చి ఇంకా 70 రోజులు కూడా కాలేదన్నారు.