– నాలుగు రోజుల పాటు సాగనున్న ఉత్సవాలు
– నేడు జాతరకు కేంద్ర మంత్రి అర్జున్ ముండా, ఎంపీ బండి సంజయ్
ప్రతీ ఏడాదిలాగే ఈసారి అమవాస్య నాడు (శనివారం) అర్ధరాత్రి ఆదివాసీల నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ప్రారంభకానున్న ఈ జాతరకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 28వరకు జరిగే ఈ జాతరకు ఆదివారం కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ముండా, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ హాజరై ప్రత్యేక పూజలు చేయనున్నారు. పూర్తిగా గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా జరగనున్న ఈ జాతరను మెస్రం వంశీయులతో పాటు, ఆదివాసీలు నిర్వహిస్తారు. ఈ జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. 24న నిర్వహించే దర్బార్ సమావేశానికి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు.