- మార్చి 31 నుంచి ఐపీఎల్
- తొలి మ్యాచ్‌లో తలపడనున్న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్
క్రికెట్ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అనే వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 31 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుండగా, అహ్మదాబాద్ వేదికగా గతేడాది విజేత గుజరాత్ టైటాన్స్‌తో చైన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఏప్రిల్ 1న పంజాబ్ కింగ్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 2న -సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్ మధ్య మరో డబుల్ హెడర్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో భాగంగా మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు (18 డబుల్ హెడర్స్) ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. మొత్తం 10 జట్లు తన సొంత మైదానంలో ఏడు మ్యా్‌చ్‌లు, ప్రత్యర్థి మైదానంలో ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ మెగా లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు సార్లు విజేతగా నిలవగా, చెన్నై సూపర్ కింగ్స్ 4, కోల్‌కతా నైట్‌రైడర్స్ 2, హైదరాబాద్ 2 (దక్కన్ ఛార్జర్స్ 1, సన్‌రైజర్స్ 1), రాజస్తాన్, గుజరాత్ ఒక్కోసారి ట్రోఫీని అందుకున్న విషయం తెలిసిందే.