Aadi: ఆంధ్రుల కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్న మాట యాదికి లేదా?

0
136
  • ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తి సంగీతం సమకూరిస్తే తెలంగాణ పాట మైల ప‌డుత‌దా?
  • ఇది దొర‌గ‌డిల పాట కాదు.. దొర‌ల‌ను దిగంతాల‌కు త‌రిమిన మ‌ట్టి మాట‌
  • ప్ర‌జల ఆకాంక్ష‌ల మేర‌కే అధికారిక చిహ్నం రూపకల్పన
  • రాష్ట్ర అధికారిక చిహ్నం, గీతంపై బీఆర్‌ఎస్‌ది అనవసర రాద్దాంతం
  • ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌

‘ఆంధ్రుల కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని కేసీఆర్‌ అన్నమాట బీఆర్‌ఎస్‌ నేతలకు యాదికి లేదా? యాదాద్రి ఆర్కిటెక్ట్ గా ఆంధ్రా సాయిని నియమించినప్పుడు ఎక్కడ పోయింది మీ పౌరుషం?

ఆంధ్ర కోడలు సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా, ఆంధ్రా అమ్మాయి మంచు లక్ష్మిని తెలంగాణ స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా, రాష్ట్రానికి సంబంధం లేని రకుల్‌ప్రీత్ ని బాలిక విద్యకు బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్ నియమించినప్పుడు మీరంతా ఎక్కడికిపోయారు?

తెలంగాణ ఆర్తి, గుండెత‌డి తెలిసిన అణ‌గారిన వ‌ర్గానికి చెందిన అందెశ్రీ గీతానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టాభిషేకం చేస్తుంటే బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?

ఈ గీతానికి ఆస్కార్‌ అవార్డు గ్రహిత కీరవాణి సంగీతం సమకూరిస్తే మీకొచ్చిన ఇబ్బందేమిటీ’ అని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం ఆయన వేములవాడ పట్టణంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్‌కు తెలంగాణపై సోయి లేదని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చి పదేళ్లు పాలించిన వీరు ‘జయ జయ తెలంగాణ’ను రాష్ట్ర గీతంగా చేయలేకపోయారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పిస్తే అడ్డుపడుతున్నారన్నారు.

ఆంధ్రా మూలాలు ఉన్న వ్యక్తి మ్యూజిక్ కంపోజ్ చేస్తే తెలంగాణ పాట మైల ప‌డుత‌దా.. స్వ‌రాష్ట్రంగా ఏర్పాటై ప‌దేళ్లు అయ్యాక కూడా ఇంకా ప్రాంతీయ పంచాయితీ దేనికి అని ప్రశ్నించారు.

ఎవరితో స్వ‌ర క‌ల్ప‌న చేయించాలో ర‌చ‌యిత అందెశ్రీ ఇష్టమని, ర‌చ‌యిత‌కు స్వేచ్ఛ ఉండొద్దా అన్నారు. ‘ఇది దొర‌గ‌డీల పాట కాదు మీరు చెప్పిన‌ట్లు గానం చేయ‌డానికి.. దొర‌ల‌ను దిగంతాల‌కు త‌రిమిన మ‌ట్టి మాట‌. మీ మ‌రుగుజ్జు వాద‌నను మానుకోండి’ అని హితవు పలికారు.

తెలంగాణ వాదం అంటే విశాల దృక్పథం..


తెలంగాణ వాదం అంటే సంకుచిత భావాల సమాహారం కాదని, విశాల దృక్పథం అన్నారు. అందుకే అందెశ్రీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందన్నారు.

పొట్ట‌కూటి కోసం వ‌చ్చిన వాళ్లతో తెలంగాణ‌కు పంచాయితీ లేదని, పొట్టకొట్టే వాళ్లతోనే పంచాయితీ అని ఆనాడే ఉద్య‌మంలో చెప్పుకున్నామని ఆది శ్రీనివాస్‌ గుర్తుచేశారు.

అస్కార్ అవార్డు గ్ర‌హిత ఎం ఎం కీరవాణి ఏనాడైనా తెలంగాణ ఉద్య‌మాన్ని వ్య‌తిరేకించారా.. స‌మైక్య రాగం ఆలపించారా? క‌ల‌ల‌కు ఎల్ల‌లు లేవు.. హ‌ద్దులు స‌రిహ‌ద్దులు అస‌లే లేవని స్పష్టం చేశారు.

ప్ర‌త్యేక తెలంగాణ త‌న‌కు తానుగా సొంత అధికారిక గీతాన్ని ఆమోదించుకుంటున్న సంద‌ర్భం. మంచి పండ‌గ రోజు. ఈ పండ‌గ రోజున రాజ‌కీయ వివాదాల‌ను ప‌క్క‌నపెట్టి యావ‌త్ తెలంగాణ ఒక్క‌టే అనే నీతిని జ‌గానికి చాటుదామని పిలుపునిచ్చారు.

రాచరికపు ఆనవాళ్లు లేకుండా..


రాచ‌రిక‌పు ఆన‌వాల్లు లేకుండా.. తెలంగాణ తిరుగుబాటు త‌త్వం, శ్రమైక జీవన విధానం, ఒక్క‌డి మ‌ట్టి మ‌నుషుల పోరాటాలు, అస్థిత్వ ప్ర‌తీక‌ల‌కు ప్ర‌తిబింబంగా తెలంగాణ చిహ్నాన్ని ప్ర‌జ‌లు, ఉద్య‌మ‌కారులు, మేదావులు, ప్ర‌జా సంఘాల ఆకాంక్ష‌ల మేర‌కు రూపుదిద్దుకుంటుందన్నారు.

కాక‌తీయ క‌ళాతోర‌ణం, చార్మినార్ లు తెలంగాణకు తీపి గుర్తులే అయినా చిహ్నాన్ని కేవలం ఆ రెండు గుర్తుల‌కు ప‌రిమితం చేయ‌డం స‌రికాద‌నే ప్రభుత్వం చిహ్నాన్ని విస్తృత ప‌రుస్తుందని చెప్పారు.

‘కాక‌తీయ క‌ళాతోర‌ణం, చార్మినార్ అంటే గౌర‌వం ఉంది. కానీ ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌, అది మోసిన బోయవ్వరు? అనే చ‌రిత్ర మ‌న‌కు ఇప్పుడు కావాలి.

వేట‌గాడి చ‌రిత్ర ఒక్క‌టే చ‌రిత్ర కాదు..గాయ ప‌డ్డ లేడి పిల్ల చ‌రిత్ర కూడా చ‌ద‌వాలి. అందుకే తెలంగాణ కీర్తి, ఆర్తి, పోరాటం, చైత‌న్య ప్ర‌తిక‌ల‌కు చిహ్నంలో స్థానం క‌ల్పిస్తున్నాం’ అని స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌గా ఎందుకు మార్చారు?


అధికారం పోయాక కేసీఆర్‌, కేటీఆర్ తెలంగాణ ప్రజలపై వలకబోస్తున్న ప్రేమను ప్రజలంతా గమనిస్తున్నారని ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలపై ఇంత ప్రేమ వలకబోస్తున్న వీరు అసలు పార్టీ నుంచి తెలంగాణ పదం ఎందుకు తీసివేసి భారత రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మీరు మీ పార్టీ నుంచి తెలంగాణ పాదం తీసివేసినప్పుడే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగు బంధం తెంపుకున్నారని, అందుకే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here