15 పరుగుల తేడాతో ఓడిన గుజరాత్
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్సా అనుకున్నది సాధించింది. మంగళవారం చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 15 పరుగుల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ 2023లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా ధోనీ సేన నిలిచింది. 173 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ నిర్ణీత 20ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (42; 38 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, సాహా(12), హార్దిక్ పాండ్యా(8), డేవిడ్ మిల్లర్(4), విజయ్ శంకర్(14), దసున్ శనక(16)లు విఫలం అయ్యారు. ఆఖర్లో రషీద్ ఖాన్(30; 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడినప్పటికి అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికే ఉపయోగపడింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా, మహేశ్ తీక్షణ, దీపక్ చాహర్, మహేశ్ పతిరన లు తలా రెండు వికెట్లు తీయగా తుశార్ దేశ్ పాండే ఓ వికెట్ పడగొట్టాడు. అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(60; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో రాణించగా డేవాన్ కాన్వే(40; 34 బంతుల్లో 4 ఫోర్లు) పర్వాలేనిపించాడు. శివమ్ దూబే(1), మహేంద్ర సింగ్ ధోని(1) లు విఫలం కాగా అజింక్యా రహానే(17), అంబటి రాయుడు(17)లకు మంచి ఆరంభాలు లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంతో విఫలం అయ్యాడు. చివర్లో రవీంద్ర జడేజా(22; 16 బంతుల్లో 2 ఫోర్లు) వేగంగా ఆడాడు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు తీయగా దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.