వ్యవసాయ సంక్షోభం ప్రభుత్వ వైఫల్యమే
ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ పరిపాలన వైఫల్యమేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం బారులుతీరిన రైతన్నలపై లాఠీఛార్జి చేయడం అత్యంత దారుణమని ఆయన అన్నారు. అన్నదాతలపై దాడి చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓవైపు రైతులపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటని విమర్శించారు.
రాజకీయాలను పక్కనబెట్టి రైతు సమస్యలు పట్టించుకోవాలని సూచించారు. మార్పు తెస్తాం.. ప్రజాపాలన అందిస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతన్నలపై లాఠీఛార్జి పేరుతో దాడులు చేయడమే కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తానన్న మార్పు ఇదేనా అని ప్రశ్నించారు.
అన్నదాతలపై దాడులకు పాల్పడ్డ అధికారులపై వెంటనే కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇప్పటికే ధాన్యం కొనుగోలులో విఫలమైందని, విత్తనాలు కూడా సరిగ్గా అందించలేని నిస్సహాయస్థితికి చేరిందని విమర్శించారు.
యుద్ధప్రతిపాదికన ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి సమీక్ష ఏర్పాటు చేసి రైతన్నల కష్టాలు తొలగించాలన్నారు. తాము రైతన్నలకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగేవరకు అవసరమైతే బీఆర్‌ఎస్ తరఫున విస్తృతమైన నిరసన కార్యక్రమాలను చేపడతామని కేటీఆర్ హెచ్చరించారు.