– నాలుగోసారి ఛాంపియన్‌గా నిలిచిన కంగారులు
– అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ ఓటమి
– నిరాశపర్చిన ఆటగాళ్లు
దక్షిణాఫ్రికాలోని బోనోని వేదికగా ఆదివారం జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. 254 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 174 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ ఆదర్మ్ సింగ్ (47), మురుగన్ అభిషేక్ (42) మినహా టీమిండియా బ్యాటర్లంతా విఫలమయ్యారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. హర్జస్ సింగ్ (55), కెప్టెన్ విబ్జెన్ (48), డిక్సన్ (42) పరుగులతో రాణించారు. ఇదిలాఉంటే దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్‌లోనూ టీమిండియా టాప్ ఆర్డర్ విఫలం కాగా, మిడిలార్డర్ రాణించడంతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లోనూ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు విఫలం కాగా, అభిమానులంతా మిడిలార్డర్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ కూడా విఫలం కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ ప్రపంచకప్‌తో ఆస్ట్రేలియా అండర్-19 జట్టు నాలుగు సార్లు (1988, 2002, 2010) విశ్వవిజేతగా నిలిచిన జట్టుగా అవతరించింది. ఇక భారత్ ఐదుసార్లు టైటిల్ గెలిచి మొదటిస్థానంలో ఉంది.