ప్రజానావ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి జూలై 26, 27 (బుధ, గురు వారాలు) రెండు రోజుల పాటు అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈమేరకు తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం ఆదేశించారు. గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడడంతో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు ఐదు రోజుల పాటు భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే ఇప్పటికే నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులు, చెరువులు, వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగం రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను ప్రకటిస్తూ ప్రజలను అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలుజారీ చేస్తోంది.