– ఆగస్టు 1న జరిగే అన్నాబావ్ సాఠే జయంత్యుత్సవాల్లో పాల్గొననున్న బీఆర్ఎస్ అధినేత
-సాంగ్లీ నుంచి కొల్హాపూర్ కు వెళ్లనున్న కేసీఆర్
-అక్కడ మహాలక్ష్మి అమ్మవారి సందర్శన, ప్రత్యేక పూజల నిర్వహణ
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలాఖరులో మరొకసారి మహారాష్ట్ర పర్యటించనున్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన దళితనేత, సామాజిక వేత్త అన్నాబావ్ సాఠే జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. అక్కడి స్థానిక నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఆగస్టు 1న మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా వార్వా తహశీల్ వాటేగావ్ గ్రామంలో జరిగే అన్నాభౌ సాఠే 103 వ జయంత్యుత్సవాల్లో కేసీఆర్ పాల్గొంటారు. మాతంగ సామాజికవర్గానికి చెందిన అన్నాబావ్ సాఠే అసలు పేరు తుకారాం బావురావ్ సాఠే.
అన్నాబావ్ దళిత ఉద్యమ నాయకుడు, సామాజికవేత్త. స్వతహాగా కవి, రచయిత కూడా. సాఠే 35 కు పైగా నవలలు రాశారు. బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా పోరాడిన ఒక యువకుని జీవనగాథ ఆధారంగా రూపొందిన ఫకీరాకు 1961 లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నవల పురస్కారాన్ని పొందింది. రష్యాలోని మాస్కో నగరంలోని మార్గరీటా రుడోమినో అల్ రష్యా స్టేట్ అంతర్జాతీయ సాహిత్య గ్రంథాలయం దగ్గర లోక్షాహిర్ అన్నాబావ్ సాఠే విగ్రహాన్ని స్థాపించారు.
అన్నాబావ్ సాఠే స్మృతి దివస్ లో పాల్గొన్న తరవాత బీఆర్ఎస్ అధినేత అక్కడి నాయకులకు కండువా కప్పి పార్టలోకి ఆహ్వానిస్తారు. ఆ తరవాత ఆయన సాంగ్లీ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్హాపూర్ కు చేరుకొని అక్కడ కొలువైన మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేశంలోని 108 శక్తి పీఠాల్లో కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం ఒకటి.