- బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నా
- బీజేపీ కలిసి రాకపోతే ప్రత్యామ్నాయం వైపు..
- జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
తెలంగాణ తనకు పునర్జన్మ ఇచ్చిన నేల అని జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం తన ప్రచార వాహనం వారాహికి పూజ చేయించేందుకు కొండగట్టుకు వచ్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తన రాజకీయం తెలంగాణ నేలపైనే మొదలైందని, అయినా ఇక్కడి రాజకీయాల్లో తన పాత్ర పరిమితమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై స్పందిస్తూ ప్రస్తుతం తాను బీజేపీతో ఇప్పుడు కలిసే ఉన్నానని, ఆ పార్టీతో పొత్తు కొనసాగుతోందన్నారు. వారం రోజుల్లో ఎన్నికలు ఉంటే పొత్తులపై మాట్లాడొచ్చని, కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా వెళ్తామని, లేకపోతే ఒంటరి పోరుకు కూడా సై అని పవన్ చెప్పారు. ఓట్లు చీలనివ్వనని మరోసారి పేర్కొన్నారు. బీజేపీ కలిసి వచ్చేలా ప్రయత్నాలు చేస్తానని, కలిసి రాకపోతే వేరే పార్టీల వైపు చూడాల్సి వస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలు వేర్వేరని, రెండింటినీ పోల్చి చూడలేమని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు. 7 నుంచి 14 పార్లమెంట్ స్థానాల్లో తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలపాలన్న యోచనలో ఉన్నట్లు పవన్ ఈ సందర్భంగా ప్రకటించారు. అనంతరం కొండగట్టు నుంచి ధర్మపురి దర్శనానికి వెళ్లి, అక్కడ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు.