Reactor exploded|సంగారెడ్డిలో ఘోరం

0
124
  • ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో పేలిన రియాక్టర్‌
  • డైరెక్టర్ సహా ఆరుగురు మృతి
  • 10 మందికి పైగా గాయాలు
  • ప్రమాద సమయంలో ఘటన స్థలం వద్ద 50మందికి పైగా కార్మికులు

సంగారెడ్డి బ్యూరో, ప్రజానావ: సంగారెడ్డిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో బుధవారం సాయంత్రం రియాక్టర్ పేలడంతో డైరెక్టర్‌ సహా ఆరుగురు మృతి చెందగా, పది మందికిపైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద సమయంలో ఘటన స్థలం వద్ద 50మంది కార్మికులున్నట్లు తెలుస్తోంది. మృతులు, బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఎప్పటిలాగే పరిశ్రమలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్‌ పేలిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అది కాస్త భారీ అగ్నిప్రమాదానికి కారణమైందని పేర్కొన్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమ డైరెక్టర్‌ రవితో పాటు కార్మికులు దయానంద, సుబ్రహ్మణ్యం, సురేశ్‌ పాల్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

ఆ తర్వాత మరికొందరు కార్మికులు కూడా మృతి చెందారని వెల్లడించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది పరిశ్రమ వద్దకు చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చింది. మంటల్లో చిక్కుకుని కార్మికులు చేసే రోదనలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది.

ఇదిలాఉంటే రియాక్టర్‌ పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న రెండు భవనాలు కూలిపోయాయని, పరిశ్రమలో ఉన్న మరో రియాక్టర్‌ పేలే అవకాశం ఉన్నట్లు పరిశ్రమకు చెందిన ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఒకవేళ అదే జరిగితే దీని ప్రభావం మూడు కిలోమీటర్ల దూరం వరకు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బాధితులకు అండగా ఉంటాం: సీఎం రేవంత్‌ రెడ్డి
ఎస్బీ పరిశ్రమ ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన సీఎం రేవంత్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

పేలుడు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. ఇదే ఘటనపై గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

మెరుగైన వైద్యం అందించాలి: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌


పరిశ్రమలో పేలుడువల్ల జరిగిన అగ్నిప్రమాదంలో కార్మికులు మరణించడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

పేలుడులో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here