ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌కు త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నానక్ రామ్‌గూడలో ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా హైదరాబాద్ నగరాన్ని గత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని, రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.
ఫైర్ డిపార్ట్‌మెంట్ అనేది కేవలం అగ్ని ప్రమాదాల కోసమే కాదని, విపత్కర పరిస్థితుల్లోనూ సేవలందిస్తారని తెలిపారు. ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులిచ్చే ఫైర్ డిపార్ట్‌మెంట్‌కి భవనం ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు.
గత ప్రభుత్వం ఫార్మా సిటీని ఎయిర్‌పోర్ట్ పక్కన ప్లాన్ చేస్తే, మేము పల్లెల్లో ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. గత పాలకుల్లా ఫార్మాసిటీపై ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటే మేడిగడ్డలా తయారవుతుందన్నారు.
ప్రపంచంతో పోటీపడే స్థాయికి హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.