ipl: ఆ జట్లకు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షే

0
33

ఈసారైనా నిరీక్షణకు తెరపడేనా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీ20 టోర్నమెంట్ ప్రారంభమై ఇప్పటికే 16 ఏళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో పలు జట్లు ఐపీఎల్ ఛాంపియన్‌లుగా నిలిచాయి.

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అత్యధిక సార్లు ట్రోఫీలు గెలుచుకున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు కూడా ఐపీఎల్‌లో విజేతగా నిలిచాయి.

అయితే ఆరంభం నుంచే ఐపీఎల్ బరిలో ఉన్న పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ను సాధించలేక పోయాయి.

ప్రతిసారి ఈ జట్లకు నిరాశే మిగులుతోంది. బెంగళూరు ఇప్పటి వరకు మూడు సార్లు ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఢిల్లీ కూడా ఫైనల్‌కు చేరినా విజయం మాత్రం సాధించలేక పోయింది. ఇలాంటి స్థితిలో ఈ జట్లకు ఐపీఎల్ ట్రోఫీ కల తీపి జ్ఞాపకంగానే మిగిలిపోయింది.

అయితే ఈసారి ఎలాగైనా ఆ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఈ జట్లు ఉన్నాయి. మహిళల ఐపీఎల్ లో బెంగళూరు టీమ్ ఛాంపియన్‌గా నిలవడంతో పురుషుల జట్టుపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈసారి ఛాలెంజర్స్ ట్రోఫీ గెలుస్తుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సీజన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగడం, ఒంటిచేత్తో ఇంటిదారి పట్టడం బెంగళూరుకు అనవాయితీగా మారింది.

కానీ ఈసారి మాత్రం ఆ అనవాయితీని మార్చాలనే పట్టుదలతో బెంగళూరు జట్టు ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆ జట్టు చాలా బలంగా ఉంది.

విరాట్ కోహ్లి, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్, సిరాజ్, దినేశ్ కార్తీక్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. దీంతో బెంగళూరు ఈసారి ట్రోఫీ ఫేవరెట్ జట్లలో ఒకటిగా కనిపిస్తోంది.

పంజాబ్ కింగ్స్‌ది కూడా ఇలాంటి పరిస్థితే. జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించలేక పోయింది. 2014లో పంజాబ్ ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకోక తప్పలేదు.

ఈసారి శిఖర్ ధావన్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న పంజాబ్ ఎలాగైనా ట్రోఫీని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.

అయితే ఇతర జట్లతో పోల్చితే పంజాబ్‌లో పెద్దగా స్టార్ ఆటగాళ్లు లేకపోవడం కాస్త ఇబ్బందికర పరిణామంగా చెప్పాలి. రొసొ, లివింగ్‌స్టోన్, శామ్ కరన్, జోస్ బట్లర్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

కెప్టెన్ ధావన్ ఎలా ఆడతాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇప్పటి వరకు ట్రోఫీని గెలువలేక పోయింది. ఈసారి మాత్రం ఆ లోటును పూడ్చుకోవాలని భావిస్తోంది.

డేవిడ్ వార్నర్, యశ్ ధుల్, పృథ్వీ షా, షాయ్ హోప్, మిఛెల్ మార్ష్, రిషబ్ పంత్ వంటి స్టార్లు జట్టులో ఉన్నారు. కెప్టెన్ పంత్ సుదీర్ఘ విరామం తర్వాత ఐపిఎల్ బరిలో దిగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈసారి జట్టును విజేతగా నిలపాలనే పట్టుదలతో పంత్ ఉన్నాడు. కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ కూడా ట్రోఫీని గెలవాలని భావిస్తోంది. రాహుల్ సారథ్యంలోని లక్నోలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు.

సమష్టిగా రాణిస్తే ఐపీఎల్ లో మెరుగైన ఫలితాలు సాధించడం లక్నో జట్టుకు కష్టమేమీ కాదనే చెప్పాలి. కాగా, పది జట్లు బరిలోకి దిగుతున్న ఐపీఎల్ సమరంలో ఫలానా జట్టు ట్రోఫీని సాధిస్తుందని ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.

అన్నీ జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఉన్నారు. భారత్‌తో పాటు విదేశాలకు చెందిన స్టార్ ఆటగాళ్లు ఆయా జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, వార్నర్, మ్యాక్స్‌వెల్, కెఎల్ రాహుల్, ధావన్, సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్, మిఛెల్ మార్ష్, బట్లర్, పంత్, యశస్వి జైస్వాల్ వంటి విధ్వంసక బ్యాటర్లు ఆయా జట్లలో ఉండడంతో ఈసారి కూడా ఐపీఎల్ లో పరుగుల వరద ఖాయం.

ప్రస్తుత పరిస్థితుల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై, మాజీ విజేతలు ముంబై, కోల్‌కతా, సన్‌రైజర్స్ జట్లు ఫేవరెట్‌గా కనిపిస్తున్నాయి.

మరోవైపు మాజీ విజేత జట్లను వెనక్కి నెట్టి తొలిసారి ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో ఇతర జట్లు ఉన్నాయి. దీంతో ఈసారి కూడా ఐపీఎల్ సమరం నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here