ఇంట్లోకి పాము వచ్చింది.. భయంగా ఉంది!

0
11

– జీహెచ్‌ఎంసీ అధికారులకు బాధితుడి ఫిర్యాదు
– ఆరు గంటలైనా స్పందించని అధికారులు
– అధికార యంత్రాంగంపై ఆగ్రహం
– పాముని పట్టుకొని జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌కు
– ఖంగుతిన్న అధికారులు
ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ప్రాజెక్టులు, నదులు, చెరువులు, వాగులు అన్ని నిండుకుండలా మారాయి. ఇక హైదరాబాద్‌ వంటి పట్టణాల్లో అయితే రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. అక్కడక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వరద నీరు ఇళ్లల్లోకి చేరుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉంటే జీహెచ్‌ఎంసీ పరిధిలోని అల్వాల్‌లో ఓ వ్యక్తి ఇంట్లోకి వరద నీటితో పాటు పాము కూడా వచ్చింది. దీంతో సంపత్‌ కుమార్‌ అనే వ్యక్తి జీహెచ్‌ఎంసీ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేశాడు. ఇంట్లోకి పాము వచ్చిందని, భయంగా ఉందని అధికారులకు తెలిపాడు. ఆరు గంటలైనా అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో సంపత్‌కు చిర్రెత్తుకొచ్చింది. తన ఇంట్లోకి వచ్చిన పామును ధైర్యంచేసి పట్టుకున్నాడు. అలాగే దాన్ని తీసుకొని అల్వాల్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడే ఉన్న టేబుల్‌పై వదిలాడు. దీంతో కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు పామును చూసి పరుగులు తీశారు. ఈ సందర్భంగా సంపత్‌ మీడియాతో మాట్లాడుతూ ఇంట్లోకి పాము వచ్చిందని చెబితే ఆరు గంటలైనా అధికారులు పట్టించుకోలేదని వారి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సామాజికి మాధ్యమాల్లో ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here