- భద్రాచల గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక
భద్రాచలం వద్ద 43.5 అడుగులకు చేరిన నీటి మట్టం
మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
వరద ఉధృతిని పరిశీలించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
భద్రాచలంలో గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ డ్యాంల నుంచి విడుదల చేస్తున్న వరదనీటి కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం అర్ధరాత్రికి 35 అడుగుల వరకు నీటిమట్టం వస్తుందని అధికారులు అంచనా వేయగా.. గురువారం మధ్యాహ్నానికి 43.5 అడుగులకు వరదనీరు పెరగడంతో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ప్రస్తుతం 9 లక్షల 47 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరకట్ట స్లూయిజ్ వద్ద బ్యాక్ వాటర్ కారణంగా రామాలయ ప్రాంతమైన విస్తా కాంప్లెక్స్‌లోకి వరదనీరు వచ్చి చేరింది. ప్రత్యేక మోటార్ల సహాయంతో నీటిని తోడి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, అధికారులతో కలిసి గురువారం వరద ఉధృతిని పరిశీలించారు. గోదావరి వరదల వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వరద పెరిగే పరిస్థితి ఉన్నప్పుడు ముంపు ప్రాంతాల ప్రజలకు ముందుగానే అవగాహన కల్పించి పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు చెప్పారు.
కాలువలు, కుంటలు, చెరువుల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తకాలనీలో వరదనీరు చేరే అవకాశం ఉన్నందున అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవైనా సమస్యలు తెలియజేయడానికి కొత్తగూడెం (08744 241950, సెల్ 9392919743), భద్రాచలం ఐటిడిఎ (08743 232244) భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం (08743 232444, సెల్ 7981219425)లలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలను సంప్రదించాలని తెలిపారు.