గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తే అభివృద్ధి కాదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విమర్శించారు. రాజ్‌భవన్‌లో గురువారం గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది అన్నారు. వైద్యం, ఐటీ రంగాల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. తెలంగాణ ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని, కొందరికి ఫార్మ్ హౌస్ లు కాదు.. అందరికీ ఫార్మ్ లు కావాలని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుందామని తెలిపారు. కొంత మందికి నేను నచ్చక పోవచ్చు.. కానీ నాకు తెలంగాణ వాళ్లు అంటే ఇష్టమన్నారు. పవిత్ర తెలంగాణ నేలపై జాతీయ జెండా ఎగురవేయడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదార్ల విస్తరణ కు భారీగా నిధులిస్తున్న ప్రధాని మోడీకి ఈ సందర్భంగా గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఆదిమ గిరిజన జాతుల వారి కోసం రాజ్ భవన్ కార్యక్రమాలు చేపట్టిందని, ఛాన్స్ లర్ కనెక్ట్ అల్యూమినీ ద్వారా ఉన్నత విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తామని తెలిపారు. రైతులు, పేదలు అందరికీ భూములు, ఇండ్లు కావాలన్నారు. ధైర్యంగా ఉండాలని యువతకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్ అందిస్తోందన్నారు.