రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10వ తరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
సోమవారం వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్ పి.గౌతమి లతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్ష జరుగుతున్న తీరును పరీశీలించామని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాలలో ఎట్టి పరిస్థితులలో ఎవరు కూడా సెల్ ఫోన్ తీసుకుని వెళ్లకుండా పకడ్బందీగా చెక్ చేస్తున్నామని, పరీక్ష కేంద్రాలకు ఎవరికి సెల్ ఫోన్ అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
పరీక్షా కేంద్రాలకు సకాలంలో విద్యార్థులు చేరుకునేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అన్నారు.
జిల్లాలో మొదటి రోజు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రమేష్ కుమార్ పేర్కొన్నారు.
జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలలో సోమవారం నిర్వహించిన పదవ తరగతి తెలుగు పరీక్షలో 6475 విద్యార్థులకు గాను 6469 మంది విద్యార్థులు హాజరు కాగా, 99.9 శాతం హాజరు నమోదు అయినట్లు తెలిపారు.
రెగ్యులర్ విద్యార్థులు 6472 కు గాను 6467 మంది, ప్రైవేట్ విద్యార్థులు 3 కు గాను 2 మంది విద్యార్థులు హాజరైనారని పేర్కొన్నారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు , డి.ఈ.ఓ. పరీక్షా కేంద్రాలను సందర్శించారనీ, మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని, తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.
ఈ పర్యటనలో జిల్లా విద్యా శాఖా అధికారి రమేష్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్ , సంబంధిత అధికారులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.