గ్రామ స్థాయిలో రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీలు

0
3

– ఐదు నుంచి పది మందితో ఏర్పాటు, శిక్షణ
– రాష్టంలోనే జిల్లాలో ఇదే మొదటిసారి
– ప్రమాదాల్లో కాపాడిన వ్యక్తికి అవార్డులు
– సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

ప్రజానావ/సిరిసిల్ల: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షించాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రంలోనే మొదటి సారిగా గ్రామ స్థాయిలో రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీ లు ఏర్పాటు చేస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి సహకారంతో కమిటీ సభ్యులకు రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే చేసే చికిత్సలపై సోమవారం సిరిసిల్ల పట్టణంలోని కల్యాణ లక్ష్మి గార్డెన్స్ లో శిక్షణా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో మరణాలు 98శాతం రోడ్డు ప్రమాదాల రూపంలోనే జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ప్రతి గ్రామంలో ఐదు నుంచి పది మంది సభ్యులతో కూడిన రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

అదేవిధంగా హైవేలపై జరిగే ప్రమాదాలకు ఫస్ట్ రెస్పండర్ గా ఉండేందుకు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల వెంబడి ఉన్న పెట్రోల్ బంక్, దాబా, హోటల్స్ లలో పని చేసే 200 మందిని గుర్తించి వారికి నెలకు ఒకసారి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లోని వైద్యుల ద్వారా ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్, ఏడీఈ (ఆటోమేటెడ్ ఎక్సటర్నల్ డెఫిబ్రిలేషన్)లపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీలో స్వచ్ఛందంగా చేరి శిక్షణకు వచ్చిన వలంటీర్స్ ను అభినందించారు. శిక్షణలో నేర్చుకున్న ప్రథమ చికిత్స విధానాన్ని బంధువులతో పాటు స్నేహితులకు తెలియజేయాలని సూచించారు. రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీ యెక్క పూర్తి వివరాలు వారి వారి గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేస్తామని, వారి పరిధిలో ఎక్కడ రోడ్ ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించి వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందిస్తే ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుందన్నారు.

ఆ వెంటనే దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు కాపాడిన వారికి జనవరి 26, జూన్ 2, ఆగస్ట్ 15 రోజున మంత్రి చేతుల మీదుగా అవార్డులతో పాటు రివార్డులు అందజేస్తామని తెలిపారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు గోల్డెన్ అవర్ ఉంటుంది అని ఆ గోల్డెన్ అవర్(గంట) సమయంలో సాధ్యమైనంత వరకు కష్టపడి ఆ వ్యక్తిని బతికించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడం గురించే వాహనాలు తనిఖీలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రావు అత్యవసర పరిస్థితి ఎలా గుర్తించాలి, రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేయడం, ఆసుపత్రికి తరలించడం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పి తదితర అంశాల తో పాటు ప్రథమ చికిత్స ఎలా చేయాలి? ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎలా బతికించవచ్చు అనే అంశాల మీద శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య , డీఎస్పీ నాగేంద్రచారి, రవికుమార్, సీఐలు, ఎస్సైలతో పాటు సంకెపల్లి గ్రామ వలంటీర్లు రఘుడు పరుశురాములు, బండారి శ్రీనివాస్, రెడ్డవేణి వినయ్, బుర్ర సురేందర్, నాంపల్లి నాగరాజులతో పాటు ఆయా గ్రామాల వలంటీర్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here