తెలంగాణలో రికార్డు స్థాయి వర్షం

0
12

– రాష్ట్రంలో ఆగని వర్షాలు

– వేములవాడ- సిరిసిల్ల మధ్య రాకపోకలు బంద్‌
ప్రజానావ/న్యూస్‌ డెస్క్‌: తెలంగాణలో గత 24 గంటల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2013లో ములుగు జిల్లాలో కురిసిన 50 సెం.మీ వర్షమే ఇప్పటివరకు రికార్డు ఉండగా, తాజాగా కురిసిన వర్షాలతో ఆ రికార్డు కనుమరుగైంది. 2013 తర్వాత ఇటీవల నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో 46 సెం.మీ వర్షం కురిసింది. ఇదే రికార్డుగా ఉంది. అయితే తాజాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో 64 సెం.మీ రికార్డు వర్షపాతం నమోదైంది. చిట్యాలలో 61.6 సెం.మీ వర్షం కురిసింది. తెలంగాణ ఇదే ఆల్‌ టైం రికార్డు వర్షపాతంగా నమోదైంది. ఇక భూపాలపల్లిలో 61 సెం.మీ వర్షం కురవగా, ఇదే జిల్లా రేగొండలో 45 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెంలో 39 సెం.మీ, కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంటలో 37 సెం.మీ, ములుగు జిల్లా వెంకటాపురంలో 36 సెం.మీ, హన్మకొండ జిల్లా కమలాపుర్‌లో 35 సెం.మీ, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో 29 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే గత 24 గంటల్లో 35 ప్రాంతాలకు పైగా 20 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, దాదాపు 200 కేంద్రాలకు పైగా 10 సెం.మీ వర్షం కురిసింది.
భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం వద్ద గోదావరి వరద గురువారం ఉదయం 50.50 అడుగులకు చేరుకున్నట్లు కలెక్టర్‌ డా.ప్రియాంక తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రహదారులపైకి వరద నీరు చేరిన ప్రాంతాలతో పాటు పొంగుతున్న వాగులు దాటకుండా బారికేడింగ్ చేసినట్లు చెప్పారు. వరద ఉధృతి కొనసాగుతున్నదని, అలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయని, ప్రజలు పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకు ప్రయాణాలను వాయిదా వేసుకుని ఇంటి వద్దనే ఉండాలని కలెక్టర్ సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి నది నుంచి 12,86,136 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు 7 లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు మూత పడ్డాయని, 2వేల చెరువుల్లో 1035 ఇప్పటికే పూర్తిగా నిండాయన్నారు.
వేములవాడ – సిరిసిల్ల ప్రధాన రహదారిపై రాకపోకలు బంద్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అయ్యప్ప గుడి ముందుకి భారీగా వరద నీరు చేరింది. ఎక్కడికి అక్కడ వాహనాలు నిలిచిపోయయి. జేసీబీ సహాయంతో నీటిని మళ్లిస్తూ, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు అధికారులు. ఈ సహాయక చర్యలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్సీ నాగేంద్ర చారి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్ రాజు రెడ్డి, పట్టణ సీఐ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
నీట మునిగిన మేడారం
మరోవైపు ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో మేడారం గ్రామం చుట్టూ నీరు చేరింది. ఇప్పటికే ఆసియాలో అతి పెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారక్క గద్దెల వద్దకువరద చేరుకుంది. మరోవైపు జంపన్నవాగు సైతం ఉధృతంగా ప్రవహించడంతో ఐటీడీఏ క్యాంప్‌ ఆఫీస్‌, షాపులు నీట మునిగాయి. ఇదిలాఉంటే మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడురులో ఏరు ఉధృతంగా ప్రవహించడంతో గంగమ్మ తల్లి ఆలయం శిఖరం వరకు మునిగిపోయింది. 1980 తర్వాత ఇంతటి స్థాయిలో వరద రాలేదని గ్రామస్థులు పేర్కొంటున్నారు. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలంలో సీరోల్ నుంచి చింతపల్లికి వెళ్లే దారిలోని మొండివాగు, తాళ్లసంకీసవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున రాకపోకలు నిషేధించినట్లు సీరోలు ఎస్సై రమాదేవి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here