ప్రధాన మోదీ పేదల కష్టాలు తెలిసినోడు

0
7

– పీఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల మందికి ఇండ్లు కట్టించారు
– కేసీఆర్ జూబ్లీహిల్స్ డివిజన్ లో ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చారా?
– ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రా రెడ్డి

ప్రజానావ/ఖైరతాబాద్‌: ప్రధాన మోదీ పేదల కష్టాలు తెలిసినోడని, పీఎం ఆవాస్ యోజన కింద ఇప్పటికే దాదాపు 3 కోట్ల మందికి ఇండ్లు కట్టించారని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రా రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ డివిజన్‌ ఇందిరానగర్ బూత్ నెం 134 లో స్థానిక బీజేపీ నేతలతో కలిసి మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మోదీ తొమ్మిదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ను ఓడించే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల్లో విలువ లేదని, ఈ విషయాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆరే చెబుతున్నారన్నారు.

ఆత్మాభిమానం ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు దీనిపై ఆలోచించుకోవాలన్నారు. నగరంలో ఎక్కడచూసినా అధ్వాన్నంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉన్నాయని, శానిటైజేషన్ సిబ్బంది జాడలేరని, అసలు అధికార యంత్రాంగం, అధికార పార్టీ నాయకులు ఎక్కడ పోయారని మండిపడ్డారు. మోసపూరిత మాటలతో ప్రజలను అధోగతిపాలు చేస్తున్నారని విమర్శించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏండ్లు గడుస్తున్నా సరైన రోడ్లకు దిక్కులేదు, డ్రైనేజీ వ్యవస్థ అంతకంతకు అధ్వానంగానే ఉందన్నారు. ప్రభుత్వం సంక్షేమ ఫలాలు పేదలకు అందింది లేదని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఇప్పటికీ మోక్షం లేదన్నారు.

అందుకే, దుర్మార్గపు బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను యాత్ర ద్వారా తెలుసుకొని, రానున్న కాలంలో పరిష్కరించే దిశగా ముందుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here