వడ్డీ, చిట్ ఫండ్ వ్యాపారులపై పోలీసుల మెరుపు దాడులు

0
1

– వేములవాడలో 12 బృందాల తనిఖీలు
– వడ్డీ, చిట్ ఫండ్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు
– రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం
– వడ్డీ వ్యాపారి బుస్స ధశరథం కార్యాలయంలో రూ.9.95 లక్షల నగదు సీజ్
– వడ్డీ వ్యాపారులకు సిఐ వెంకటేష్ హెచ్చరిక

ప్రజానావ, వేములవాడ

వేములవాడ పట్టణంలోని వడ్డీ, చిట్ ఫండ్ వ్యాపారులపై శుక్రవారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. మొత్తం 12 బృందాలు ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. పట్టణంలోని ఆరుగురు వ్యాపారుల కార్యాలయాలపై సోదాలు నిర్వహించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పట్టణ సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ మెరుపు దాడులు కొనసాగాయి. ఈ దాడుల సమాచారం తెలుసుకున్న మరికొందరు తమ దుకాణాలను సర్దుకుని పరారయ్యారు. ఉప్పుగడ్డ వీధిలోని బుస్స దశరథం ఇంటి వద్ద చిట్ ఫండ్ కార్యాలయం వద్ద అర్థరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది.

సిఐ వెంకటేష్ ప్రత్యక్షంగా ఈ దాడుల్లో పాల్గొని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. యజమాని ధశరథం లేకపోవడంతో బీరువాలను తెరిపించేందుకు సిఐ రాత్రి 11 గంటలకు వరకు సిబ్బందిని గస్తీ పెట్టారు. అనంతరం ధశరథంను పిలిపించి బీరువాలను తనిఖీ చేశారు. ఇందులో రూ. 9.95 లక్షల నగదుతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వెంకటేష్ తెలిపారు. పట్టణంలో పలువురు వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఒక్క వ్యాపారి ఇంటి వద్దే అర్థరాత్రి వరకు సోదాలు జరగడంతో స్థానికులు సైతం ఉత్కంఠగా ఎదురుచూశారు. వడ్డీ వ్యాపారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here