రేపు 8.5 కోట్ల రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధులు

0
11

– తెలంగాణలో సుమారు 39 లక్షల మందికి లబ్ధి
– ప్రధాని కిసాన్ సేవ కేంద్రాలుగా ఎరువుల రిటైల్ షాపులు
– కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

ప్రజానావ/హైదరాబాద్‌: 8.5 కోట్ల రైతుల ఖాతాల్లో 14వ విడత పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధులు గురువారం ఉదయం జమ కానున్నాయి. తెలంగాణలో సుమారు 39 లక్షల మంది రైతుల అకౌంట్లలో ఈ డబ్బులు పడనున్నాయి. అలాగే రేపటి నుంచి ప్రధాని కిసాన్ సేవ కేంద్రాలుగా ఎరువుల రిటైల్ షాపులను మార్చుతున్నామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో 2.8 కోట్ల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. తొలిదశలో 1.25 లక్షల షాప్ లని ప్రధాని రేపు ప్రారంభిస్తారని ఈ షాప్ ల్లో సల్ఫర్ కోటెడ్ యూరియా కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు పెరిగాయన్నారు. ‘ఎరువుల కోసం ఒక దగ్గరికి, భూసార పరీక్షలకు ఒక దగ్గరకు.. ఇలా అనేక చోట్లకు వెళ్లాల్సి వస్తున్నది. అలా కాకుండా రేపటి నుంచి రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలు.. కిసాన్​ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నిర్దేశిత ధరల్లో రైతులకు అందుబాటులో ఉంటాయి. భూసార పరీక్షలు, సీడ్​ టెస్టింగ్​ సౌకర్యాలు ఉంటాయి. కిసాన్​ సేవా కేంద్రాలు రేపటి నుంచి అందుబాటులోకి వస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే.. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే.. అవినీతి రహిత ప్రభుత్వం రావాలంటే అది మోడీ నాయకత్వంలోని బీజేపీతో మాత్రమే సాధ్యమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here