డౌటే లేదు.. మళ్లీ బీఆర్‌ఎస్‌దే విజయం

0
25

– ముఖ్యమంత్రి కేసీఆర్‌
ప్రజానావ/సూర్యాపేట: మరోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ అద్భుతంగా గెలవబోతుందని.. అందులో ఎలాంటి డౌట్‌ లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన ప్రగతి నివేదన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరెన్ని కథలు చెప్పినా.. ఏం మాట్లాడినా.. పోయినసారి కంటే ఇంకో ఐదు ఎక్కువ సీట్లతోని బీఆర్‌ఎస్‌ గెలువబోతుందన్నారు. తాము చెప్పేటివి కట్టుకథలు, పిట్టకథలు కావని స్పష్టం చేశారు. ‘ కల్యాణలక్ష్మీ, రైతుబీమా రోజూ మీరు చూస్తూనే ఉన్నారు. ధాన్యం అమ్మితే డబ్బులు ఎట్ల వస్తున్నయో మీకు తెలుసు. 24 గంటల కరెంట్‌ ఎట్ల వస్తుందో మీకు తెలుసు. ఏ విధమైన ప్రజాసంక్షేమం ఉందో మీకు తెలుసు. ఇవన్నీ మీ కండ్ల ముందు జరగుగుతున్నయ్‌’ అని గుర్తుచేశారు. వీటిగురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరైనా, ఎప్పుడైనా ఆలోచన చేసిండ్రా అని ప్రశ్నించారు. నేలవిడిచి సాము చేసినట్టు డైలాగులు చెప్పి పిచ్చి లేపి పోయిండ్రు తప్ప.. ప్రజల బాధలు ఏంటనేది పట్టించుకున్న వాళ్లు మాత్రం లేకుండే అని అన్నారు. ఇప్పుడు ఉన్న సదుపాయాలన్నీ ఇంకా మెరుగవ్వాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇక్కడికే సంతోషపడవద్దని, ఇవి ఇంకా పెరగాలని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ జరగాలంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలవాలన్నారు. ఇంకా అద్భుతాలు జరగాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అన్నారు.
విశ్వనగరంగా హైదరాబాద్‌
విశ్వనగరంగా హైదరాబాద్‌ మారిపోయే పరిస్థితులు కనబడుతున్నాయని, పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి, సంక్షేమం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఇప్పుడొచ్చి ఏది పడితే అది చెబుతారని, ఆపద మొక్కులు మొక్కుతారని విమర్శించారు. అరచేతిలో వైకుంఠం చూపించడంతో మోసపోతే గోసపడాల్సి వస్తుందని హెచ్చరించారు. మీమీ గ్రామాల్లో విచక్షణతో చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రజలకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here