వనమాపై అనర్హత వేటు

0
30

– ఎన్నిక చెల్లదంటూ తేల్చిచెప్పిన హైకోర్టు
– కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగంవెంకట్‌రావు పేరు ప్రకటన
– రేపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం?

ప్రజానావ/హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చట్టవిరుద్ధంటూ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. కాగా 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జలగం వెంకట్‌రావుపై గెలుపొందారు. వనమా కాంగ్రెస్‌ తరఫున గెలిచినా, తదనంతర చోటుచేసుకున్న పరిణామాల్లో భాగంగా బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే అంతకుముందే వనమా ఎన్నికల కమిషన్‌కు తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని జలగం కోర్టుకెక్కారు. అక్కడ పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో నేడు తెలంగాణ హైకోర్టు వనమా ఎన్నిక చెల్లదని సంచలన తీర్పునిచ్చింది. అంతేకాకుండా అప్పటి ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్‌రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఇదిలాఉంటే తప్పుడు అఫిడవిట్‌ సమర్పించి ఎన్నికల కమిషన్‌ను మోసం చేసినందుకుగాను వనమా వెంకటేశ్వర్‌రావుకు రూ.5లక్షల జరిమానా విధించింది. అయితే బుధవారం అధికారికంగా జలగం వెంకట్‌రావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే వనమా వెంకటేశ్వర్‌ రావు, జలగం వెంకట్‌రావు ఇద్దరూ బీఆర్‌ఎస్‌ నేతలే కావడం విశేషం. తాజా రాజకీయ పరిణామాల్లో హైకోర్టు తీర్పు బీఆర్‌ఎస్‌కు మింగుడుపడని విషయమనే చెప్పాలి.
బీఆర్‌ఎస్‌కు షాక్‌ మీద షాక్‌..
మంగళవారం ఒక్కరోజే బీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ మీద షాక్‌ తగిలింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నికల చెల్లదని హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చిన కాసేపటికే మరో ఇద్దరు నేతలపై సస్పెన్సన్‌ వేటు పడేట్లు కనిపిస్తోంది. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ విషయంలోనూ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎలక్షన్‌ అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం పొందు పరిచారంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ను కొట్టివేయాలంటూ హైకోర్టులో మంత్రి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఇక సోమవారం బీఆర్‌ఎస్‌ నేత, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌పై కాంగ్రెస్‌ నేత మదన్‌మోహన్‌ హైకోర్టులో దాఖలు చేసిన వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడా బీబీ పాటిల్‌కు చుక్కెదురైంది. దీంతో ఎలక్షన్ల ముందు బీఆర్‌ఎస్‌ నేతలపై అనర్హత కత్తి వేలాడుతుండడంపై సర్వత్రా టెన్షన్‌ నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here