జన సమీకరణపై నజర్‌

0
22

– నల్లగొండ సభ కోసం బీఆర్‌ఎస్ భారీ కసరత్తు
– జిల్లానేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం
– నియోజకవర్గానికి 10వేల మందికి తగ్గకుండా ఏర్పాట్లు

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 13న నల్లగొండ జిల్లాలో నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే నల్లగొండ జిల్లా నాయకులతో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమావేశమై, వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది పార్లమెంట్‌ ఎన్నికలు ఉండడంతో బీఆర్‌ఎస్‌ మరింత జాగ్రత్త పడుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బీఆర్‌ఎస్‌, ఈ సభతో సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు ఏ సమావేశంలోనైనా, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై ఈ సభా వేదిక నుంచే గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా కృష్ణా జలాలపై కూడా ఈ సభ ద్వారా స్పష్టతనిచ్చేలా అవకాశం కనిపిస్తోంది. ఇదిలాఉంటే కేసీఆర్‌ సభ కోసం జిల్లా నేతలు భారీగా జన సమీకరణ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. భారత రాష్ట్రసమితి ఆవిర్భావం తర్వాత.. ఇప్పటి వరకు భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఈ మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమీక్షించి జన సమీకరణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పటి నుంచే జన సమీకరణపై దృష్టి పెట్టారు. సమయం తక్కువగా ఉండడంతో అధిష్ఠానం సైతం జన సమీకరణ బాధ్యతలను నగర నేతలకే అప్పగించింది.

ఈ క్రమంలో నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేస్తూ సభకు జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10వేల మందికి తగ్గకుండా హాజరయ్యేలా చూడాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు జన సమీకరణలో కీలక భూమిక పోషించాలని ఆదేశించినట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గానికి ఇతర జిల్లాలకు చెందిన.. సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఈ బాధ్యతలను అప్పగించారు. ఎన్నికల ఏడాది కావడంతో ఇక కేసీఆర్ ఏ కార్యక్రమాన్ని అయినా భారీగానే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రానున్న పార్లమెంట్ ఎన్నికలు సైతం బీఆర్‌ఎస్‌కు సవాల్ విసురుతున్నాయి. అయితే చివరి నిమిషంలో కేసీఆర్‌ ప్రజల్లోకి వస్తే నమ్మి ఓట్లేస్తారా.. లేక అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఓడిస్తారా అనేది చూడాలి. మరోవైపు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తీసుకుంటున్న చర్యల కారణంగా కాంగ్రెస్‌కు జనాల్లో విపరీతమైన నమ్మకం ఏర్పడింది. ఇంకోవైపు తెలంగాణలో ఎలాగైనా ఎక్కువ సీట్లు దక్కించుకోవాలన్న పట్టుదలతో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఉన్నారు.

ఉత్తరాదిన తిరుగులేని పరిస్థితి ఉన్నా.. దక్షిణాదిలో వారికి పట్టుచిక్కడం లేదు. దీంతో ఈసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో వీలైనన్నీ సీట్లు గెలిచేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతంకంటే బలపడడంతో బీజేపీ పెద్దలు తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here