షేక్‌పేట్ మండల పరిధిలో పెరిగిన భూ కబ్జాలు
హెచ్చరిక బోర్డులను పక్కనబెట్టి మరీ ఆక్రమణలు
దొంగ పత్రాలు సృష్టించి కొందరు దర్జాగా దోపిడీ
‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు
ప్రజానావ, ఖైరతాబాద్: సర్కారు స్థలాలను భూ బకాసురులు యథేచ్ఛగా స్వాహా చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డులు పెట్టినా అవి తీసి మరీ కబ్జాలకు పాల్పడుతున్నారు.
ఇంకొందరైతే ఏకంగా రోడ్డు వైండింగ్‌లో భాగంగా తమ భూములు కోల్పోయామంటూ దొంగ పత్రాలు సృష్టించి దర్జాగా భూములను కబ్జా చేస్తూ అందినంతా దోచుకుంటున్నారు.
షేక్‌పేట్ మండల పరిధిలో ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ‘మామూలు’గా తీసుకోవడం విశేషం.
షేక్‌పేట్ మండల పరిధిలో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అందినకాడికి దోచుకుంటున్నారు.
రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను సైతం తొలగించి ఆక్రమిస్తున్నారు. కబ్జాదారుల వెనుక పెద్దల హస్తం ఉండటమే దీనికి కారణంగా కనిపిస్తోంది.
వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. షేక్‌పేట్ పరిధిలో జూబ్లీహిల్స్ డివిజన్ ఫిల్మ్ నగర్‌లో ఎప్పుడో ఏర్పడ్డ బాలరెడ్డి నగర్, వినాయక్ నగర్ లో ఇప్పుడు రోడ్డు వైండింగ్ లో ఇల్లు పోవడం ఒక వింత.
జూబ్లీహిల్స్ డివిజన్ లోని ఫిల్మ్ నగర్‌లో బాలరెడ్డి నగర్, రాక్ గార్డెన్, పర్వతంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న ప్రభుత్వం స్థలాలపై కన్నేసేసిన కొందరు లీడర్లు కబ్జా చేసేందుకు తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ అధికారులను మోసం చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్నో ఎకరాల విలువైన స్థలాలు కబ్జాకు గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
50 గజాల చొప్పున అమ్మకం..
ఈ ప్రభుత్వ స్థలాలపై కన్నేసి కబ్జా చేసిన కొందరు దర్జాగా 50 గజాల చొప్పున చేసి ఇతరులకు రూ. లక్షల్లో విక్రయిస్తున్నారు.
అదే విధంగా ఫిల్మ్ నగర్ రాక్‌గార్డెన్‌కు కేటా యించిన సర్కారు స్థలాన్ని కబ్జా చేసి ఇళ్ల స్థలాలుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ స్థలంలో నిర్మాణాలు చేపడుతుండగా ఇటీవల రెవెన్యూ అధికారులు అడ్డుకుని కూల్చివేతలు చేపట్టారు. కొందరు అక్కడ కాంక్రీట్ వాల్ వేయగా తొలగించారు.
తక్కువ ధరకే వస్తుందని ఆశపడి కొన్న కొందరు రోడ్డున పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అధికారులు కేవలం తూతూమంత్రంగా కూల్చివేతలు జరిపి తమకేం సంబంధం లేనట్లు ‘మామూలు’గా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు కాపాడి బోర్డ్ ఏర్పాటు చేస్తారో.. లేదా ఎప్పటిలాగే తమకేం సంబంధం లేదనట్లుగా ఉంటారో వేచి చూడాలి.