కేసీఆర్‌ అంకెల గారడీ.. కాంగ్రెస్‌ మాటల గారడీ!

0
36

– రైతు డిక్లరేషన్ చిత్తు కాగితమేనా?
– వ్యవసాయ బడ్జెట్‌ దేనికి సరిపోతుంది
– రైతుబంధు (భరోసా), రుణమాఫీ, పంట బీమా సంగతేంటి?
– కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

బడ్జెట్‌లో కేసీఆర్‌ది అంకెల గారడీ అయితే.. కాంగ్రెస్‌ అంకెల గారడీతో పాటు మాటల గారడీ కూడా చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన వ్యవసాయ బడ్జెట్‌పై మాట్లాడారు. ఈ బడ్జెట్‌ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి రూ.19,746 కోట్లు కేటాయించిందని, ఈ బడ్జెట్‌ దేనికి సరిపోతుందో చెప్పాలని ఆయన విమర్శించారు. రైతుబంధు (భరోసా), రైతు రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంటరుణాలు, విత్తనాభివృద్ధి పరిస్థితేంటి అని ప్రశ్నించారు. దీంతో ఎన్నికల ముందు రైతుల కోసం వరంగల్ లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ చిత్తు కాగితమేనని మండిపడ్డారు. వ్యవసాయరంగ కార్యక్రమాలకు ఈ బడ్జెట్ ఎలా సరిపోతుందో సమాధానం చెప్పాలి.

కౌలు రైతులు, రైతు కూలీలకు భరోసా ఇస్తామన్నారు. అవి నీటిమీద రాతలేనా..? అధికారంలోకి వస్తే 6 గ్యారంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారంటీ ఇక అమలుకానట్టేనా అన్నారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించారు తప్ప.. ఎన్నికల వాగ్దానాల కోసం చెప్పిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాల్లో మొదటి సమావేశంలో బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధం చేస్తామన్నారు.. వాగ్దానాన్ని తుంగలో తొక్కి బీసీలను నిలువునా మోసం చేసింది.

కామారెడ్డి లో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ కూడా చెత్తబుట్టలో వేశారు. బడ్జెట్ 73వ రాజ్యాంగ సవరణ గురించి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అంబేద్కర్ మాటలను ఉటంకించారు. కానీ, అమలులో మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామ పరిపాలన కోసం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సర్పంచులను తొలగించి, ప్రత్యేక అధికారులను నియమించిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల బలోపేతం గురించి మాట్లాడటం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని కిషన్‌ రెడ్డి విమర్శించారు.

ఈ సంవత్సరం ఎన్నికలు లేనట్టేనా?
గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి బడ్జెట్ లో ఎక్కడా చెప్పలేదు. అంటే ఈ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించనట్లేనా..? గతంలో కూడా దశాబ్దాలుగా ఎన్నికలు నిర్వహించని చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. పట్టణాభివృద్ధి కోసం కేటాయించిన నిధులు కూడా అంతంతమాత్రమేనని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన కోసం ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ తో లండన్ దాకా పోయిన ముఖ్యమంత్రి.. ఒకసారి గుజరాత్ సబర్మతీ నది దగ్గరకు వెళ్తే సుందరీకరణ ఎట్ల చేయాలో అర్థమవుతదన్నారు.

15శాతం ఉన్న మైనారిటీలకు రూ. 2,200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం .. 50% పైగా ఉన్న బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో వైద్యరంగానికి రూ. 11 వేల కోట్లు కేటాయించిన ఈ ప్రభుత్వం.. అసలు ‘రాజీవ్ ఆరోగ్య శ్రీ’ని తెలంగాణలో అమలు చేస్తోందా? దీనికోసం ఎన్ని నిధులు అవసరం? ఎంత కేటాయించారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి నిధులు కేటాయించకుండా ఎన్నికల సందర్భంగా మీరు చేసిన వాగ్దానాలన్నీ ఎలా అమలు చేస్తారన్నారు.

గత ప్రభుత్వం చేసిన తప్పులనే మళ్లీ..
సాగునీటి ప్రాజెక్టులకు మీరు కేటాయించిన నిధులు (రూ. 28 వేల కోట్లు) ఏమాత్రం సరిపోవు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వమూ చేస్తోంది. గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు చెల్లించాల్సిన వడ్డీకి కూడా ఈ నిధులు సరిపోవని కిషన్‌ రెడ్డి అన్నారు. కృష్ణానది మీద నిర్మించబడుతున్న అనేక ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేస్తామన్నారు కదా.. మరి నిధులు కేటాయించకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి గొప్పగా చెప్పుకున్నరు. బడ్జెట్ లో కేటాయించింది మాత్రం రూ. 7,700 కోట్లు. మీరు వాగ్ధానం చేసినట్లుగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు కట్టడానికి మొత్తం రూ. 22 వేల కోట్లు అవసరమైతే.. ఇచ్చింది రూ. 7,700 కోట్లు మాత్రమే. మీరు హామీ ఇచ్చిన గ్యారంటీ కోసం కేటాయించిన నిధులే తక్కువ.. వాటితో ఇండ్ల నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ఇండ్ల నిర్మాణం విషయంలో చెప్పేదెక్కువ..

చేసేది తక్కువ అన్నట్లుగానే ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఆర్భాటంగా ప్రకటించిన ‘యూత్ డిక్లరేషన్’ కోసం ఎక్కడా నిధులు కేటాయించలేదని, విద్యారంగం గురించి మీరు చెప్పిన అంశాలన్నీ నీటిమీద రాతలేనని స్పష్టమైంది. అసలు బడ్జెట్ ప్రసంగంలో యూనివర్సిటీల ఊసేలేదన్నారు. మొత్తం మీద ఈ బడ్జెట్.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలు అమలు చేయకుండా తప్పించుకునేలా కనబడుతోందని, ఇది తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన దారుణ మోసమని విమర్శించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేసినవన్నీ అబద్ధపు వాగ్దానాలేననే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here